కాజీపేట, నవంబర్ 25 : రైల్వేశాఖ సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలోని కాజీపేట రైల్వే జంక్షన్ బలార్షా సెక్షన్లో వచ్చే ఏడాది (2026) జనవరి, ఫిబ్రవరి రెండు నెలలలో 22న రోజుల పాటు అన్ని ప్రయాణికుల రైళ్లను రద్దు, దారి మళ్లించి నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సెక్షన్లోని మందమర్రి రైల్వేస్టేషన్లో జరగనున్న మూడో లైన్ నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా జనవరి 24 నుంచి ఫిబ్రవరి 14 వరకు 22 రోజులపాటు కాజీపేట రైల్వే జంక్షన్ బలార్షా సెక్షన్ లో ప్రతిరోజు, రెండు మూడు రోజులకు ఒకసారి నడిచే (వారాంతరపు) పలు ప్రయాణికుల రైళ్ల రాకపోకలను రద్దు చేయనున్నారు.
సుదూర ప్రాంతాలైన తిరువనంతపురం, కన్యాకుమారి, బెంగళూరు, యశ్వంత పూర్, హుబ్లీ, చెన్నై, కలకత్తా, ముంబై, న్యూఢిల్లీ, జమ్ముతావి, బిలాస్పూర్, వారణాసి, దానాపూర్ తదితర ముఖ్య రైల్వే కేంద్రాల నుంచి నడిచే పలు రైళ్లను కాజీపేట, సికింద్రాబాద్, నిజాంబాద్, అకోలా, ఇటార్సీ, నాగపూర్ తదితర రైల్వే స్టేషన్ల మీదుగా దారి మళ్ళించి నడప నున్నారు. ఈ సెక్షన్ మీదుగా ఈ తేదీలలో రైల్వే శాఖ రద్దు పరిచిన, దారి మళ్లించిన పలు రైళ్ల వివరాలు, విషయంను ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులు కోరారు.