Cheetah Population : దేశంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ప్రాజెక్ట్ చీతా (Project Cheetah)’ మరో కీలక మైలురాయిని అందుకుంది. మధ్యప్రదేశ్ (Madhyapradesh) లోని కునో నేషనల్ పార్క్‌లో సోమవారం ‘జ్వాల’ అనే ఆడ చీతా ఐదు కూనలకు జన్మనిచ్చింది. దాంతో దేశంలో చీతాల సంతతి మరింత పెరిగింది. ఈ కొత్త కూనల రాకతో దేశంలో పుట్టిన చీతా పిల్లల మొత్తం సంఖ్య 33కు చేరుకుంది. అదేవిధంగా దేశంలోని మొత్తం చీతాల సంఖ్య 53 కి పెరిగింది.
ఈ శుభవార్తను కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇది ‘ప్రాజెక్ట్ చీతా’కు గర్వకారణమని ఆయన అభివర్ణించారు. విజయవంతంగా మూడోసారి తల్లి అయిన ‘జ్వాల’ కూనో నేషనల్ పార్క్‌లో ఐదు కూనలకు జన్మనిచ్చిందని చెప్పారు. ఇది భారతదేశ వన్యప్రాణి సంరక్షణ ప్రయత్నాలలో మరొక మైలురాయి అని పేర్కొన్నారు. ఇవాళ జన్మించిన కూనలతో కలిపి భారతదేశంలో పుట్టి ఆరోగ్యంగా పెరుగుతున్న చీతా పిల్లల సంఖ్య 33కి పెరిగిందని అన్నారు.
భారతదేశ గడ్డపై ఇది 10వ విజయవంతమైన చీతాల జననం అని మంత్రి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ విజయం కోసం క్షేత్రస్థాయిలో అహర్నిశలు శ్రమిస్తున్న పశువైద్యులు, అటవీ అధికారులు, సిబ్బంది అంకితభావానికి ఇది నిదర్శనమని కొనియాడారు. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కూడా ఈ పరిణామంపై సంతోషం వ్యక్తంచేశారు. ఇది వన్యప్రాణుల సంరక్షణలో ఒక చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. జ్వాల చీతా ఐదు కూనలకు జన్మనివ్వడం ప్రాజెక్ట్ చీతాలో మరో గొప్ప విజయమన్నారు. దాంతో దేశంలో చీతాల జనాభా అర్ధసెంచరీ మార్కును దాటి 53కి పెరిగిందని చెప్పారు.
2022లో సెప్టెంబర్ 17న నమీబియా నుంచి తొలి విడతలో భారత్‌కు తీసుకొచ్చిన ఎనిమిది చీతాల్లో ‘జ్వాల’ ఒకటి. భారత్‌కు వచ్చినప్పటి నుంచి ఇది మూడోసారి పిల్లలకు జన్మనిచ్చింది. కాగా గత నెలలోనే ‘గామిని’ అనే మరో చీతా కునో పార్క్‌లో నాలుగు కూనలకు జన్మనిచ్చింది. అలాగే ఫిబ్రవరి 28న బోట్స్వానా నుంచి ఆరు ఆడ, మూడు మగ చీతాలతో కూడిన మూడో బ్యాచ్‌ను కునో పార్క్‌లోకి విడుదల చేశారు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఈ శుభవార్త వెలువడింది.