Gurukul Promotions | హైదరాబాద్, ఆగస్టు 11 : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగులు చిరకాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ల ప్రక్రియకు ఎట్టకేలకు కదలిక వచ్చింది. సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (TGOA), తెలంగాణ ప్రభుత్వ ఆల్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (TGARIEA) రాష్ట్ర నాయకులు మంగళవారం సెక్రటేరియట్లో మర్యాదపూర్వకంగా కలిసి, గురుకులాల్లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అన్ని ప్రమోషన్లను తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ప్రమోషన్లకు సంబంధించిన ఫైల్‌పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సంతకం చేసి, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి కంభంపాటి శారదకు పంపించారు. అంతేకాకుండా, గురుకులాల్లో పరిపాలనా సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు ప్రమోషన్లు పొందే ఉద్యోగులంతా బాధ్యతతో, సమర్థవంతంగా పనిచేయాలని సూచిస్తూ, ప్రమోషన్ల ఉత్తర్వులను వెంటనే విడుదల చేయాలని కార్యదర్శికి ఫోన్ ద్వారా తెలియజేసినట్లు నాయకులు తెలిపారు. 1,400 ప్రమోషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సాంఘిక సంక్షేమ గురుకులాల్లో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న జాయింట్ సెక్రటరీ,డిప్యూటీ సెక్రటరీలు, జోనల్ ఆఫీసర్లు, ప్రిన్సిపల్స్‌తో పాటు ఇతర అన్ని క్యాడర్లకు సంబంధించిన సుమారు 1,400 ప్రమోషన్లను ఎలాంటి జాప్యం లేకుండా విడుదల చేయాలని నాయకులు మంత్రిని కోరారు. ప్రమోషన్లు లేకపోవడం వల్ల అనేక కీలక పోస్టులు ఇన్చార్జి అధికారులతో కొనసాగుతున్నాయని, దీనివల్ల పరిపాలనా వ్యవస్థపై ప్రభావం పడుతోందని వివరించారు. ఇదే అంశంపై తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కూడా సాంఘిక సంక్షేమ శాఖకు లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసింది. డిప్యూటీ సెక్రటరీ పోస్టుల భర్తీలో నిర్దేశిత 3:1 నిష్పత్తి పాటించడం, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయడం, ఖాళీగా ఉన్న కీలక పోస్టులను నిబంధనల ప్రకారం భర్తీ చేయడం వంటి అంశాలను ఆ సంఘం తన లేఖలో ప్రస్తావించింది.
2023 నుంచి కొన్ని కీలక పోస్టులు ఖాళీగా ఉండటంతో ఇన్చార్జి వ్యవస్థ కొనసాగుతోందని, అర్హులైన సీనియర్, అకడమిక్ అధికారులకు ప్రమోషన్లు ఆలస్యం కావడం వల్ల ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొందని పేర్కొంది.
ఈ సందర్భంగా TGARIEA రాష్ట్ర అధ్యక్షుడు అలగోని నరసింహులు గౌడ్ మాట్లాడుతూ.. గురుకుల ఉద్యోగులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ల అంశంపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సానుకూలంగా స్పందించి, ఫైల్‌పై వెంటనే సంతకం చేసి కార్యదర్శికి పంపడం ఉద్యోగులకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. ఇక మిగిలిన ప్రక్రియను వేగవంతం చేసి అన్ని క్యాడర్ల ప్రమోషన్ల ఉత్తర్వులు వెంటనే విడుదల చేయాలని కోరారు. అలాగే ఈ అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లి, TGARIEA విజ్ఞప్తిని ప్రభుత్వ స్థాయిలో ముందుకు తీసుకెళ్లడంలో చొరవ చూపిన తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. శ్యామ్, TGARIEA సెంట్రల్ యూనిట్ అధ్యక్షుడు మామిడి నారాయణ, TGARIEA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. జనార్దన్, ఎస్. గణేష్ తదితర రాష్ట్ర నాయకులకు గురుకుల ఉద్యోగుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి సానుకూల స్పందనతో గురుకుల ఉద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించాయి.
ప్రమోషన్ల ప్రక్రియను ఇక ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేసి, జాయింట్ సెక్రటరీ డిప్యూటీ సెక్రటరీ నుంచి ప్రిన్సిపల్స్ , జోనల్ ఆఫీసర్, ఇతర అన్ని క్యాడర్లకు సంబంధించిన ప్రమోషన్లను వెంటనే ప్రకటించాలని TGARIEA ప్రభుత్వాన్ని కోరుతోందని అలగోని నరసింహులు గౌడ్ తెలిపారు.
ప్రమోషన్లు కేవలం ఉద్యోగుల వ్యక్తిగత ప్రయోజనం మాత్రమే కాదని, గురుకులాల పరిపాలనను బలోపేతం చేయడానికి, విద్యార్థులకు మెరుగైన విద్యా–సంక్షేమ సేవలు అందించడానికి కూడా అత్యంత అవసరమని నాయకులు పేర్కొన్నారు. అర్హత, సీనియారిటీ, నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా ప్రమోషన్లు కల్పించడం ద్వారా ఉద్యోగుల్లో బాధ్యత, ఉత్సాహం మరింత పెరుగుతుందని వారు అన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి కంభంపాటి శారదకు, అలాగే ఈ సమస్య పరిష్కారం కోసం చొరవ తీసుకున్న TGOA , TGARIEA రాష్ట్ర నాయకులకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉద్యోగుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.