Umanga Kumawat : ‘మిస్ యూనివర్స్ ఇండియా’ 2026 ఫైనలిస్ట్ ఉమాంగ కుమావత్ (Umanga Kumawat) మళ్లీ తన రొటీన్ లైఫ్‌లో బిజీ అయింది. నెల క్రితం జైపూర్‌లో ముగిసిన అందాల పోటీల్లో తళుక్కుమన్న ఈ అమ్మాయి.. కిరీటం దక్కలేదనే బాధను మరిచి తన పనిలో తాను మునిగిపోయింది. బెంగళూరులోని గూగుల్ క్లౌడ్‌లో ల్యాప్‌టాప్ చేతబూని ఆఫీస్ లైఫ్‌ను, సహచరులతో ముచ్చట్లను తిరిగి ఆస్వాదిస్తోంది. ఆమెను మళ్లీ విధుల్లో చూసిన ఉద్యోగులు హల్లో బ్యూటీ అంటూ ఆహ్వానించారు.ఉమాంగ బ్యాక్ టు వర్క్ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండవుతోంది
జైపూర్‌లో జరిగిన ‘మిస్ యూనివర్స్ ఇండియా -2026’ పోటీలు ముగిసి నెల రోజులు కూడా కాలేదు. ఈ పోటీల్లో ఫైనల్ చేరిన ఉమాంగ కుమావత్ టైటిల్ గెలవకున్నా మళ్లీ తన వర్క్‌లైఫ్‌తో అందరి చేత శభాష్ అనిపించుకుంటోంది. ఫైనల్ తర్వాత బెంగళూరు వచ్చిన ఆమె తన వర్క్ లైఫ్‌ను ఆస్వాదిస్తోంది. ఇంజనీర్ అయిన ఉమాంగ మళ్లీ కార్పొరేట్ లైఫ్ మొదలైందని చెబుతూ డే ఇన్ మై లైఫ్ అంటూ వీడియో పెట్టింది. గూగుల్ క్లౌడ్‌లో యాథావిధిగా తన పని తాను చేసుకుంటోందీ బ్యూటీ.
సెప్టెంబర్ 14వ తేదీన ఆమె డే ఇన్ మై లైఫ్ అని వీడియో పంచుకుంది. అందులో.. ఆఫీస్‌లో పని, జిమ్‌లో వర్కవుట్స్, కాఫీ బ్రేక్‌కు సంబంధించిన దృశ్యాలున్నాయి. ఉదయం 9:30 గంటలకు ఆఫీస్‌లో అడుగుపెట్టిన ఉమాంగ.. గంటన్నరకు అక్కడి వెల్నెస్ సెంటర్ వెళ్లింది. ట్రెడ్మిల్, స్ట్రెచింగ్ వ్యాయామాలు చేసింది. ఆపై మధ్యాహ్నం12:30 గంటలకు మళ్లీ పనిలో లీనమవుతుంది. 2:10 గంటలకు లంచ్, 5:30 కాఫీ బ్రేక్.. ఇలా మిస్ యూనివర్స్ ఇండియా ఫైనలిస్ట్ తన పనిలో మునిగిపోయింది.
‘మిస్ యూనివర్స్ ఇండియా’ 2026 పోటీల్లో కజియా లిజ్ మెజో (Kaziah Liz Mejo) విజేతగా నిలిచింది. జైపూర్‌లోని జీ స్టూడియలో జరిగిన అందాల పోటీల గ్రాండ్ ఫినాలేలో ఈ కేరళ అమ్మాయిని కిరీటం వరించింది. టైటిల్ పోరులో ఏకంగా 52 మందిని ఓడించిన 19 ఏళ్ల కజియా తన కలను సాకారం చేసుకుంది.
మూడేళ్లుగా ఈ కిరీటం కోసం శ్రమించిన తను ఇప్పుడు ప్రపంచాన్ని జయించినంత సంబురంలో ఉంది. 52 మందిని వెనక్కినెట్టి అగ్రస్థానం సాధించిన ఆమెకు మాజీ మిస్ యూనివర్స్ ఇండియా మనికా విశ్వకర్మ కిరీటాన్ని ప్రదానం చేసింది. ఆహుతుల కరతాళధ్వనులు, కెమెరా వెలుగులు మధ్య కజియా తలపై కిరీటాన్ని పెట్టింది మనికా. ఈ అందాల పోటీల్లో మధ్యప్రదేశ్ నుంచి ఉమాంగ ప్రాతినిధ్యం వహించింది.