– టీఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా, వినతి
నీలగిరి, ఆగస్టు 11 : తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుక రాజు మాదిగ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు శిరసానోళ్ల బాలరాజు నాయకత్వంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ ఉమ్మడి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట టీఎమ్మార్పీఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు ఉటుకూరి కృష్ణ, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు కత్తి ఉపేందర్ మాదిగ. టీఎమ్మార్పీఎస్ నాయకులతో కలిసి ముందు ధర్నా నిర్వహించి అనంతరం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి దళిత కుటుంబానికి అంబేద్కర్ అభయ హస్తం కింద రూ.12 లక్షలు వెంటనే అమలు చేయాలన్నారు. మాదిగ దండోరా ఉద్యమకారులకు హైదరాబాద్లో 250 గజాల ఇంటి స్థలం కేటాయించి, ఇందిరమ్మ ఇల్లు నిర్మించి అందజేయాలన్నారు.
అలాగే డప్పు కొట్టే, చెప్పులు కుట్టే మాదిగలకు నెలకు రూ.5 వేల పెన్షన్ మంజూరు చేయాలన్నారు. విద్యా హక్కు చట్టం 2009 తెలంగాణ రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలు చేయాలని, ఎస్సీలకు 15% నుండి 20% వరకు రిజర్వేషన్ పెంచాలని, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఎస్సీలకు 25 శాతం పూర్తిస్థాయిలో ఉచిత విద్యను అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎమ్మార్పీఎస్ నాయకులు చిందాల సంపత్, కళ్లెపురం అశోక్, పల్లె నాగయ్య, వస్కుల కనకయ్య, బొజ్జ వెంకులు, శ్రీనివాస్, పాతకోట్ల రమేశ్, మామిడి సైదులు, గంగ బేరి శ్రీనివాస్, దంతాల వెంకటయ్య, దుబ్బ రమేశ్, కత్తి రవీందర్, పాల్వాయి వెంకటయ్య, దుబ్బా శ్యామ్, కంసాలపల్లి కరుణాకర్ పాల్గొన్నారు.

‘డప్పు కొట్టే, చెప్పులు కుట్టే మాదిగలకు నెలకు రూ.5 వేల పెన్షన్ మంజూరు చేయాలి’