చందుర్తి, సెప్టెంబర్ 26 : ఓ వ్యక్తి చనిపోయినట్టు వైద్యులు ప్రకటించాక, అకస్మాత్తుగా లేచి కూర్చున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకున్నది. చందుర్తి మండలం సనుగులకు చెందిన చీకటి శంకరయ్య (66) అనారోగ్య సమస్యతో కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం నాలుగు రోజుల క్రితం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించి చికిత్స కోసం రూ.80 వేల వరకు ఖర్చు చేశారు.
శనివారం శంకరయ్య మృతి చెందినట్టు వైద్యులు చెప్పడంతో. అంబులెన్స్‌లో స్వగ్రామానికి తీసుకొస్తున్న సమయంలో మార్గంమధ్యలో జోగాపూర్ గ్రామ సమీపంలో శంకరయ్య లేచి కూర్చున్నాడు. దీంతో అవాక్కైన కుటుంబసభ్యులు తిరిగి వేములవాడలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించగా, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని వైద్యులు వెల్లడించారు. అతడిని ఇంటికి తీసుకెళ్లగా చుట్టుపకల గ్రామస్తులు శంకరయ్యను చూసేందుకు తరలి వచ్చారు. కాగా తండ్రి ఆరోగ్యం విషమంగా ఉన్న వార్త విన్న ఇద్దరు కుమారులు గల్ఫ్ దేశం నుంచి స్వదేశానికి వచ్చారు.