హనుమకొండ చౌరస్తా : మారుతున్న పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా యువతలో ఆధునిక నైపుణ్యాలు పెంపొందించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ( Collector Chahat Bajpai ) అన్నారు.
సోమవారం ములుగురోడ్డులోని వరంగల్ ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా నిరుద్యోగ యువతకు ఉపాధి నైపుణ్యాలను పెంపొందించే ఆరు అధునాతన కోర్సుల ఉచిత శిక్షణ కార్యక్రమాలను ఆమె ప్రారంభించి మాట్లాడారు.
డిగ్రీలు ఉంటే సరిపోదని ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు ఉంటేనే ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిలబడగలరన్నారు. ఐటీఐలలో నూతనంగా తీసుకువచ్చిన అధునాతన కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ మంగునూరి చందర్ మాట్లాడుతూ అధునాతన కోర్సులలో ఉచిత శిక్షణ కోసం ఆసక్తి కలిగిన అభ్యర్థులు ములుగురోడ్లో ఉన్న వరంగల్ ప్రభుత్వ ఐటీఐ కార్యాలయంలో నేరుగా సంప్రదించి పేరు నమోదు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో హనుమకొండ ఐటీఐ ప్రిన్సిపల్ సక్రు, కాజీపేట ఐటీఐ ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు, కార్యాలయాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.