లక్నో: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిస్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) కాన్పూర్‌లో ప్రవేశం కోసం ఒక విద్యార్థి ప్రయత్నించాడు. సైబర్ సెక్యూరిటీ కోర్సులో అడ్మిషన్ నిరాకరించడంతో ఏకంగా ఆ సంస్థ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి తన టాలెంట్‌ను నిరూపించాడు. (IIT-Kanpur) ఐఐటీ కాన్పూర్‌లో కొత్తగా ప్రారంభించిన బ్యాచిలర్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్‌లో చేరేందుకు ఒక విద్యార్థి చాలా ఆసక్తి చూపాడు. దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు నిర్దేశిత ఫీజు చెల్లించాడు. అవసరమైన అన్ని డ్యాకుమెంట్లు అప్లోడ్ చేశాడు. సైబర్ సెక్యూరిటీపై తనకు ఉన్న పరిజ్ఞానం, అనుభవానికి సంబంధించిన రుజువులను కూడా సమర్పించాడు.
కాగా, ఆ విద్యార్థికి అడ్మిషన్‌ను ఐఐటీ-కాన్పూర్ తిరస్కరించింది. ప్రవేశ ప్రక్రియలో భాగంగా ఉన్న హ్యాకథాన్‌లో పాల్గొనే అవకాశాన్ని నిరాకరించారు. ఈ నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీలో తన టాలెంట్‌ను నిరూపించాలని ఆ విద్యార్థి భావించాడు. ఐఐటీ కాన్పూర్, ఐఐటీ మద్రాస్ వెబ్సైట్లను హ్యాక్ చేశాడు. ‘సైట్ హ్యాక్ చేశా. నాకు కావలసిందల్లా న్యాయమైన ఒక అవకాశం మాత్రమే’ అని ఐఐటీ కాన్పూర్ వెబ్సైట్లో పేర్కొన్నాడు.
మరోవైపు బ్యాచిలర్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాన్ని నిరాకరించడంతో నిరాశ చెందిన తాను ఐఐటీ కాన్పూర్, ఐఐటీ మద్రాస్ వెబ్సైట్లను హ్యాక్ చేసినట్లు ఆ విద్యార్థి సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఆ వెబ్సైట్ల హ్యాక్‌కు సంబంధించిన స్క్రీన్షాట్లను ఎక్స్, రెడ్డిట్‌లో షేర్ చేశాడు. ‘నా ఉద్దేశం హాని కలిగించడం కాదు. నా సామర్థ్యాలను ప్రదర్శించడమే’ అని వివరణ ఇచ్చాడు.
అయితే ఐఐటీ-కాన్పూర్ డైరెక్టర్ మనింద్ర అగర్వాల్ దీనిపై స్పందించారు. సైబర్ సెక్యూరిటీలో ముందస్తు అనుభవం లేకపోవడం వల్ల ఆ విద్యార్థిని షార్ట్‌లిస్ట్ చేయలేదని తెలిపారు. ఈ విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ ఇప్పటికే ముగిసిందని చెప్పారు. అయినప్పటికీ ఆ విద్యార్థిని ఇన్స్టిట్యూట్కు ఆహ్వానిస్తామని, పరీక్ష ద్వారా అతడి సాంకేతిక నైపుణ్యాలను అంచనా వేస్తామని వివరించారు. ఆ విద్యార్థి తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటే రెండో విడత అడ్మిషన్ల ప్రక్రియలో అతడికి అవకాశం ఇస్తామని వెల్లడించారు.
కాగా, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ మద్రాస్ అధికారిక వెబ్సైట్లలోని కొన్ని విభాగాల యాక్సెస్‌ను ఆ విద్యార్థి పొందినట్లు మనింద్ర అగర్వాల్ ధృవీకరించారు. ఇది చట్టవిరుద్ధమని తెలిపారు. ఇలాంటివి మళ్లీ పునరావృతం చేయకూడదని ఆ విద్యార్థికి నచ్చజెప్పమని సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులు, ఐటీ ఇంజినీర్లను కోరినట్లు చెప్పారు.
మరోవైపు వెబ్సైట్ హ్యాక్ చేసిన ఆ విద్యార్థిపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని తొలుత భావించినట్లు ఐఐటీ కాన్పూర్‌కు చెందిన ఒక అధికారి తెలిపారు. అయితే చర్యలు తీసుకునే ముందు విద్యార్థి వాదనలు ధృవీకరించుకుని, అతడి సాంకేతిక సామర్థ్యాలు అంచనా వేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అందుకే ఆ విద్యార్థికి ఇంటర్న్‌షిప్ ఆఫర్ ఇచ్చినట్లు వెల్లడించారు.
ఐఐటీ కాన్పూర్ గతంలో కూడా యువ సైబర్ సెక్యూరిటీ ప్రతిభను ప్రోత్సహించిందని ఆ అధికారి వివరించారు. ఈ ఏడాది ఆరంభంలో సీబీఎస్ఈ ఆన్లైన్ స్క్రీన్ మార్కింగ్ పోర్టల్‌లోని లోపాలు గుర్తించిన ఒక యువకుడికి తమ సీ3ఐహబ్‌లో ఒక ఉద్యోగాన్ని ఆఫర్ చేసినట్లు వెల్లడించారు.