వేములవాడ రూరల్, జూలై 29: వేములవాడ ఆర్టీసీ డిపోలో ఓ ఉద్యోగికి ఉన్నతాధికారులు వత్తాసు పలుకుతున్న తీరు ప్రస్తుతం విమర్శలకు దారితీస్తుంది. వేములవాడ బస్ డిపోలో మొత్తం ఆర్టీసీ యాజమాన్యానికి 48 బస్సులు ఉండగా, 24 అద్దె బస్సులు కూడా ఉన్నాయి. అయితే వీటిలో విధులు నిర్వహించేందుకు మొత్తం డిపోలో 120 మంది కండక్టర్లు ఉండగా ప్రస్తుతం 98 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. అయితే కండక్టర్లు కూడా సంబంధిత ఆర్టీసీ శాఖ వారి పదోన్నతుల పరీక్షలు పూర్తి చేస్తే జూనియర్ అసిస్టెంట్ లాంటి ఉద్యోగాలకు అర్హులుగా ప్రకటిస్తూ కార్యాలయ విధులను కేటాయిస్తారు.
లేదా ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్న వారైనా ఉంటే అధికారులు వారికి కూడా కండక్టర్ విధులనుంచి మినహాయింపు ఇచ్చి కార్యాలయ విధులకు కేటాయిస్తారు. ఇక వేములవాడ ఆర్టీసీ డిపోలో కండక్టర్లు మొత్తం 120 మందికిగాను 98 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో ఒకరు పిఆర్ఓ, ఒకరు కంప్యూటర్ విభాగం, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తుండగా మొత్తం నలుగురు కార్యాలయ విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారు ఇప్పటికే శాఖ పరమైన పరీక్ష ఉత్తీర్ణులు కాగా వారికి విభాగాలు కేటాయించారు. ఇక 94 మంది మాత్రమే విధులు నిర్వహిస్తుండగా మరో 26 మంది ఖాళీగా ఉన్నారు. వీరిలో విధులు నిర్వహిస్తున్న ఒక ఉద్యోగి తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఆర్టీసీ శాఖలో దాదాపు 10 ఏళ్లకు పైగా విధులు నిర్వహిస్తుండగా ఇప్పటివరకు ఆరు సంవత్సరాలుగా కార్యాలయంలో ప్రత్యేక ఉత్తర్వులపై విధులు నిర్వహిస్తూ వచ్చారు. సదరు ఉద్యోగిని ఇటీవలనే కండక్టర్ విధులకు సిబ్బంది తక్కువగా ఉండడంతో కండక్టర్ విధులను కేటాయించారు.
అయితే, ఏ ఒక్కనాడు కూడా ఆరోగ్యపరమైన సెలవులు తీసుకోకుండానే అనారోగ్యంతో బాధపడుతున్నట్లు చెబుతూ.. వారం కూడా గడవకముందే రాష్ట్ర ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకొని తిరిగి కార్యాలయంలో విధులు నిర్వహించేలా ఉత్తర్వులను జారీ చేయించుకున్నారు. కరీంనగర్ రీజినల్ పరిధిలో చేయాల్సిన ఉత్తర్వులను హైదరాబాద్ స్థాయి కార్యాలయం నుంచి చేయించుకోవడం వెనుక ఉన్నతాధికారుల వత్తాసుపై విమర్శలు వస్తున్నాయి. నిజమైన ఆరోగ్యపరమైన ఇబ్బందులు పడుతూ అనేకమంది కండక్టర్ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను కాదని పైరవీ చేసిన వారికి మాత్రమే ఇలాంటి కార్యాలయ విధులు కేటాయిస్తున్నారంటూ బాహాటంగానే ఉద్యోగులు విమర్శలు గుప్పిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.