సిరిసిల్ల : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘రాహుల్ బంధు’ (Rahul Bandhu) అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఎద్దేవా చేశారు. ఈ రాహుల్ బంధు పథకాన్ని రైతులకు ఇచ్చే రైతుబంధు నిధులతో మొదలుపెట్టాడని విమర్శించారు. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో ఇటీవల గెలుపొందిన బీఆర్ఎస్ కౌన్సిలర్ల(BRS Councillors) ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు.
సంవత్సరానికి రూ. 1,000 కోట్ల రూపాయలు రాహుల్ గాంధీకి ఇచ్చే రాహుల్ బంధు పథకం మాత్రం తెలంగాణలో పక్కాగా రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ కుటుంబానికి ఎప్పుడు ఇబ్బంది అయినా వేల కోట్ల రూపాయలు పంపించేందుకు సీఎం ప్రయత్నం చేస్తున్నాడని, అందుకే రాహుల్ గాంధీ కోసం బ్రహ్మాండమైన కొత్త పథకాన్ని తెలంగాణలో తీసుకువచ్చారని ఆరోపించారు.
రాష్ట్రంలోని రైతన్నలంతా తమకు రైతుబంధు వస్తుందని, కాంగ్రెస్ పార్టీ పెంచి ఇస్తామన్న నిధులను ఇస్తుందని ఎదురు చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి రైతుబంధును ఎగ్గొడుతున్నాడని పేర్కొన్నారు. ఇప్పటికే మూడుసార్లు రైతుబంధును ఎగ్గొట్టిన ముఖ్యమంత్రి ఈసారి కూడా రైతుబంధును ఎగ్గొట్టాడని మండిపడ్డారు. రైతులకు ఇవ్వాల్సిన రైతుబంధును పక్కన పెట్టి రాహుల్ బంధు పథకం ద్వారా తన సీటును కాపాడుకుంటున్నాడని వెల్లడించారు.

రేవంత్ రెడ్డి సామంతు రాజు లెక్క రాహుల్ గాంధీ ఢిల్లీ గద్దెకు కప్పం కడుతున్నారని విమర్శించారు. పేదల భూములు గుంజుకొని, పేదల ఇండ్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ రాహుల్కు కప్పం చెల్లిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే హైదరాబాద్ నుంచి మొదలుకొని ఖమ్మం దాకా అన్ని చోట్ల పేదల ఇళ్లను కూలగొట్టి మరి వ్యాపారం చేసి డబ్బులు సంపాదిస్తున్నారన్నారని విమర్శించారు.
అందుకే రాష్ట్రంలో ఆరు గ్యారంటీలను మొదటి క్యాబినెట్ లో నిర్ణయం తీసుకొని చట్టబద్ధత కల్పించి, అమలు చేస్తామని రాహుల్ గాంధీతో సహా అందరూ చెప్పిన మాటలను గుర్తు చేస్తూ తెలంగాణ ప్రజలకు బాకీ పడిన ఆరు గ్యారంటీల చట్టాన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రస్తావిస్తామన్నారు.
ఆరు గ్యారెంటీల అమలుకు చట్టబద్దత కోసం అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లు
ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును తీసుకువచ్చే విధంగా ప్రభుత్వంపైన బిల్లు పెట్టి ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకువచ్చే విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తామని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లుకు ఓటు వేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి మద్దతు ఇచ్చి రాహుల్ గాంధీతో సహా , పార్టీ నేతలు ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.