– కొత్తగూడెం ఏరియా నూతన జీఎంకు ఏఐటీయూసీ నాయకుల విజ్ఞప్తి
రుద్రంపూర్, ఆగస్టు 03 : కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వెంకటరమణను గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ నాయకులు సోమవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించిన నాయకులు, నూతన బాధ్యతల్లో ఆయన విజయవంతంగా రాణించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ, సింగరేణి సంస్థ అభివృద్ధి, కార్మికుల సంక్షేమం అనే రెండు లక్ష్యాలను సమన్వయం చేస్తూ తమ సంఘం దశాబ్దాలుగా నిరంతరం పోరాటాలు చేస్తూ, యాజమాన్యంతో సానుకూల చర్చలు నిర్వహిస్తూ అనేక సమస్యలకు పరిష్కారాలు సాధించిందన్నారు. ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుతో పాటు కార్మికుల సంక్షేమం, భద్రత, ఆరోగ్యం, సంక్షేమ పథకాల అమలుకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
ఏరియాలో పెండింగ్‌లో ఉన్న కార్మిక సమస్యలను ప్రాధాన్యత ఆధారంగా పరిష్కరించడం, కార్మికులకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయడం, పారిశ్రామిక సంబంధాలను సుహృద్భావ వాతావరణంలో కొనసాగించడం ద్వారా సంస్థ మరింత అభివృద్ధి చెందుతుందని వారు అభిప్రాయపడ్డారు.కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారంలో యాజమాన్యం సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఎఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి వి. మల్లికార్జున్ రావు, సహాయ కార్యదర్శి జె. గట్టయ్య, ఆఫీస్ బేరర్లు సందేబోయిన శ్రీనివాస్, శేషగిరిరావు, గుమ్మడి వీరయ్య, పిట్ కార్యదర్శులు ఎం.ఆర్.కే. ప్రసాద్, మధుకృష్ణ, కమల్, భూక్యా రమేష్, సౌజన్య, నాయకులు,పి. చంద్రయ్య, బండారు మల్లయ్య, మెంగన్ రవి, మెంగన్ రోషన్, శశివర్ధన్ రెడ్డి, కరుణాకర్, సాంబమూర్తి, అవినాష్, రాజ్‌కుమార్, అప్పారావు, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, వాసంతిక, సంధ్యారాణి, భూపతి రమణ, అశ్విని, ఓం ప్రకాష్ పాల్గొన్నారు.

‘ఉత్పత్తి–ఉత్పాదకతతో పాటు కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేయాలి’