Viral News : తమిళనాడు (Tamil Nadu) లో ఓ వింత చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ పట్టుచీరల దుకాణం (Silk Sarees shop) లో దొంగలు ఖరీదైన చీరలు అపహరించారు. ఈ చోరీకి సంబంధించి మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దాంతో భయపడిపోయిన దొంగలు చోరీ చేసిన చీరలు అన్నింటిని కొరియర్ (Corier) లో దుకాణం యజమానికి తిరిగి పంపారు. ఈ విషయాన్ని దుకాణం యజమానికి పోలీసులకు తెలియజేయడంతో.. పార్సిల్ పంపిన అడ్రస్ ఆధారంగా దొంగలను గుర్తించే పనిలోపడ్డారు. ఈ అనూహ్య ఘటన తిరువణ్ణామలై (Thiruvannamalai) జిల్లాలోని ఆరణి సమీపంలో ఉన్న సెవూరు గ్రామం (Sevuru Village) లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. సెవూరులోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయ వీధిలో కుమార్ అనే వ్యాపారి పట్టుచీరల దుకాణం నడుపుతున్నాడు. కొన్ని రోజుల క్రితం తెలంగాణ రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న ఓ లగ్జరీ కారులో నలుగురు మహిళలతో సహా ఆరుగురు వ్యక్తులు ఆయన దుకాణానికి వెళ్లారు. అక్కడ ఖరీదైన చీరలను పరిశీలించిన దొంగలు.. కొన్ని తక్కువ ధరవి కొనుగోలు చేసి వెళ్లిపోయారు. రెండు రోజుల తర్వాత షాపులో ఖరీదైన చీరలు కనిపించకపోవడంతో కుమార్ అనుమానంతో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు.
కస్టమర్లలా వచ్చి ఖరీదైన చీలను పరిశీలించి, తక్కువ ధర చీరలను కొనుక్కుని వెళ్లిన దొంగలే ఆ కనిపించకుండా పోయిన చీరలను దొంగిలించినట్లు సీసీ ఫుటేజీ ద్వారా స్పష్టమైంది. వెంటనే కుమార్ ఆరణి తాలుకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ చోరీ ఘటనపై స్థానిక వార్తాపత్రికలు, టీవీ ఛానళ్లలో కథనాలు ప్రసారమయ్యాయి. ఇది జరిగిన కొద్ది రోజులకే చోరీకి గురైన 32 పట్టుచీరలు ఓ కొరియర్ పార్శిల్లో కుమార్ చిరునామాకు వచ్చాయి.
ఆశ్చర్యపోయిన ఆయన పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం పోలీసులు ఆ పార్శిల్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆరా తీస్తూ నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.