కట్టంగూర్, ఆగస్టు 03 : ఈ నెల 10న జరిగే దేశవ్యాప్త జైల్ భరో కార్యక్రమాన్ని ప్రజలు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని ఆయన కోరారు. సోమవారం కట్టంగూర్ మండల కేంద్రంలో జరిగిన సీపీఎం నకిరేకల్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ పాలకులపై జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తితోనే నేడు ప్రజా సమస్యల పరిష్కారం కోసం “జైల్ భరో” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి గ్రామ గ్రామాన సభలు, సమావేశాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
నవంబర్లో నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగే అఖిల భారత కిసాన్ సభ 36వ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ, దేశ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆ మహాసభల్లో విస్తృతంగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు బొంతల చంద్రారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, పెంజర్ల సైదులు, బొజ్జ చిన్న వెంకులు, శంకరయ్య, రాచకొండ వెంకటేశ్వర్లు, చింతపల్లి బయ్యన్న, గంజి మురళి, జిట్ట సరోజ, మల్లయ్య, మారయ్య, మురాల మోహన్, చిలుముల రామస్వామి, మాద సైదులు, జాల అంజనేయులు, రవీందర్, తవిటి వెంకటమ్మ, పెంజర్ల కృష్ణ, కారింగ్ మల్లేష్, కొరవి దుర్గయ్య, పందుల లింగయ్య పాల్గొన్నారు.