NTR | మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ చాలా రోజుల తర్వాత అభిమానులకు కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకకు తారక్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయనకు చిత్ర బృందం ఇచ్చిన ప్రత్యేక స్వాగతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.దర్శకుడు శశాంక్ ఏలేటి రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ‘బాహుబలి’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాలను నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. అక్టోబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది.
ప్రీ-రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ వేదికపైకి వచ్చిన తీరు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. తారక్‌ను ఆహ్వానించేందుకు ‘యమదొంగ’ చిత్రంలోని పులి సన్నివేశాన్ని గుర్తు చేసేలా ప్రత్యేక కాన్సెప్ట్‌ను సిద్ధం చేశారు.సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న చిన్నారి సారా ఈ ప్రత్యేక ప్రదర్శనలో భాగమైంది. స్టేజ్‌పై ఉన్న పులి బొమ్మను తన మ్యాజిక్ ట్రిక్‌తో తారక్ రూపంలోకి మార్చినట్లుగా రూపొందించిన ఈ సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనంతరం ఎన్టీఆర్ తనదైన ఎనర్జీతో వేదికపైకి రావడంతో అభిమానుల సందడి మరింత పెరిగింది.చిన్నారి సారా చేసిన మ్యాజిక్, ఆ తర్వాత తారక్ ఇచ్చిన మాస్ ఎంట్రీ కలిసిపోయి కార్యక్రమంలో హైలైట్‌గా నిలిచాయి. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులు ఈ వీడియోలను తమ ఖాతాల్లో పంచుకుంటూ తారక్‌ను చాలా రోజుల తర్వాత ఇలా చూడటం ఆనందంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో తారక్ భుజానికి గాయం కావడంతో కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ కారణంగా ఇటీవల ఆయన బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.అలాంటి సమయంలో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ-రిలీజ్ వేడుకకు తారక్ రావడంతో అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహం కనిపించింది. నిర్మాత కార్తికేయతో ఉన్న అనుబంధం కారణంగానే ఆయన ఈ కార్యక్రమానికి హాజరైనట్లు సమాచారం.చాలా రోజుల తర్వాత తమ అభిమాన హీరోను ప్రత్యక్షంగా చూసిన అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘ఎన్నాళ్లయ్యింది సామీ నిన్ను ఇలా చూసి’ అంటూ తారక్ లుక్, ఎంట్రీపై అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
Tiger is here 🐯🔥🔥🔥🔥 pic.twitter.com/DLqedv1uCU
— NTR Trends (@NTRFanTrends) September 29, 2026