కోల్‌కతా: ఒక స్కూల్‌కు చెందిన సుమారు 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కండరాల నొప్పులు, అసాధారణ శారీరక కదలికలతో ఆ బాలికలు ఇబ్బందిపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆ స్కూల్‌కు దెయ్యం పట్టిందంటూ వదంతులు వ్యాపించాయి. (School Girls Fall Ill) పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సందేశ్‌ఖాలిలో ప్రభుత్వ సహాయం పొందే ఫుల్మోని ఆదర్శ విద్యామందిర్‌లో శుక్రవారం వింత సంఘటన జరిగింది. 9వ తరగతికి చెందిన సుమారు 30 మంది బాలికలు స్కూల్ సమయంలో ఒకరి తర్వాత ఒకరు అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కండరాల నొప్పులు, అసాధారణ శారీరక కదలికలతో బాధపడ్డారు. ఆ విద్యార్థినులను తొలుత స్థానిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం మీనాఖా గ్రామీణ ఆసుపత్రికి తరలించారు.
కాగా, ఈ సంఘటన స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల్లో భయాందోళనలు కలిగించింది. ఆ స్కూల్‌కు ‘దెయ్యం పట్టడమే’ దీనికి కారణమన్న వదంతులు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో సందేశ్‌ఖాలీ ఎమ్మెల్యే సనత్ సర్దార్ ఆ పాఠశాలను సందర్శించారు. అస్వస్థతకు గురైన కొందరు విద్యార్థినులను తన వాహనంలో ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు జిల్లా డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్, ఆరోగ్య శాఖ అధికారులు ఆ స్కూల్‌ను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. విద్యార్థినుల ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ప్రాథమిక చికిత్స తర్వాత చాలా మంది బాలికలు కోలుకున్నట్లు తెలిపారు.
అయితే అవగాహన లేకుండా దెయ్యం వదంతులు వ్యాప్తి చేయవద్దని ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు. బాలికల అనారోగ్య లక్షణాలను శాస్త్రీయ, వైద్యపరమైన కోణంలో పరిశీలించడంతోపాటు ఈ సంఘటనకు అసలు కారణాన్ని గుర్తించడంపై దృష్టి సారించినట్లు వెల్లడించారు.