ఎర్రుపాలెం, ఆగస్టు 03 : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం–తొండలగోపవరం రైల్వే స్టేషన్ల మధ్య సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో కిలోమీటర్ నెం. 542/32-34 వద్ద, పెగళ్ళపాడు ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా, వీరులపాడు మండలం, అల్లూరు గ్రామానికి చెందిన రామిశెట్టి వేణు (21) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. వ్యక్తిగత కారణాలతో సాయినగర్ షిర్డీ నుంచి కాకినాడకు వెళ్తున్న ట్రైన్ నెం.17205 సాయినగర్ షిర్డీ ఎక్స్ప్రెస్ కింద పడి అతడు ప్రాణాలు తీసుకున్నట్లు తెలిపారు. మృతుడు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు సమాచారం. ఘటనపై ఖమ్మం రైల్వే ఎస్సై సీహెచ్. వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు మధిర రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఎస్.వేణుగోపాల్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని అన్నం శ్రీనివాసరావు సహకారంతో మధిర ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు.