AP News : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్నది. వైఎస్సార్ మేనత్త వైఎస్ కమలమ్మ కన్నుమూశారు. ఆమె వయసు 88 సంవత్సరాలు. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం అమెరికాలో ఉంటున్న తన కుమార్తె మెర్సీ దగ్గరికి వెళ్లారు. మెర్సీ నివాసంలో ఉంటూనే చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో ఇవాళ తుదిశ్వాస విడిచారు.
ఇటీవల ఆమె అనారోగ్యం పాలైన సమయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ దంపతులు పులివెందులలో ఆమెను నేరుగా కలిసి పరామర్శించారు. అమెరికాలో కన్నుమూసిన వైఎస్ కమలమ్మ భౌతికకాయాన్ని స్వగ్రామమైన పులివెందులకు తరలించేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. పులివెందులలోని వైఎస్సార్ సమాధుల తోటలో ఆమె అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు సమాచారం. కమలమ్మ ఆకస్మిక మృతిపట్ల వైఎస్సార్ భార్య వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ దంపతులు, వైఎస్ షర్మిల, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డితో పాటు ఇతర కుటుంబసభ్యులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.