చౌటుప్పల్, నవంబర్ 25 : చౌటుప్పల్ మాజీ సర్పంచ్, సీపీఎం యాదాద్రి భువనగిరి జిల్లా మాజీ కార్యదర్శి వర్గ సభ్యుడు చింతల భూపాల్ రెడ్డి మరణం కమ్యూనిస్ట్ ఉద్యమానికి, ప్రజా పోరాటాలకు తీరని లోటని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. మంగళవారం స్థానిక పట్టణ కేంద్రంలోని చింతల భూపాల్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన కలిసి పరామర్శించారు, ఈ సందర్భంగా భూపాల్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో ఓ గొప్ప వామపక్ష నాయకుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. అయన పోరాటం ఇక్కడ ఎంతోమందికి స్ఫూర్తినిచ్చిందన్నారు. అంతేకాకుండా రైతాంగానికి పిలాయిపల్లి కాల్వ ద్వారా సాగునీరు కోసం అనేక దఫాలుగా ఉద్యమాన్ని నిర్వహించి సాగునీరు సాధించడంలో భూపాల్ రెడ్డి క్రియాశీలకమైన పాత్ర వహించినట్లు తెలిపారు. చౌటుప్పల్ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కారం చూపడంలో ముందుచూపుతో వ్యవహరించే వారన్నారు.
చౌటుప్పల్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా చౌటుప్పల్ పట్టణ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. సిపిఎం పార్టీలో అంచలంచెలుగా ఎదుగుతూ చౌటుప్పల్ ప్రాంతంలో అగ్రశ్రేణి నాయకుడిగా ఎదగడం జరిగిందని తెలిపారు. అయన అడుగుజాడల్లో అనేక మంది యువత పార్టీలోకి వచ్చినట్లు చెప్పారు. భూపాల్ రెడ్డి ఆశయ సాధన కోసం వామపక్షలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం పార్టీల నాయకులు పల్లె శేఖర్ రెడ్డి, బుర్గు కృష్ణారెడ్డి, పగిళ్ల మోహన్ రెడ్డి, బండారు నరసింహ, ఎండి పాషా, గోశిక కరుణాకర్, కొండూరు వెంకటేష్, దండ అరుణ్,ఉడుత రామలింగం, రొండి నరసింహ, టంగుటూరు రాములు, బద్దుల సుధాకర్, బోయ మంకులు, దాసరి కృష్ణ, మనోహర్ పాల్గొన్నారు.