Sleep | ప్రస్తుత కాలంలో సహజంగా నిద్రపోవడం చాలా కష్టతరంగా మారిందని చెప్పవచ్చు. ఒత్తిడి, ఫోన్ లను ఎక్కువగా ఉపయోగించడం, శరీరానికి తగినంత శ్రమ లేకపోవడం వంటి కారణాల వల్ల నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారని చెప్పవచ్చు. అయితే వీటితో పాటు మధ్యాహ్నం తీసుకునే ఆహారం కూడా రాత్రిపూట నిద్రపై ప్రభావాన్ని చూపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. మధ్యాహ్నం సమయంలో కొన్ని ఆహారాలను సరైన పద్దతిలో తీసుకోవడం వల్ల శరీరం సహజ నిద్రా విధానాలకు ఇవి మద్దతు ఇస్తాయని వైద్యులు చెబుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల నిద్ర నాణ్యత కూడా పెరుగుతుందని వారు తెలియజేస్తున్నారు. రాత్రి నిద్రకు సహాయం చేసే కొన్ని రకాల సూపర్ ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గాఢ నిద్ర కోసం తీసుకోదగిన వాటిల్లో బాదంపప్పు ఒకటి. దీనిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది మెరుగైన నిద్రకు, విశ్రాంతికి తోడ్పడే ఖనిజం. సాయంత్రం 5 నుండి 7 గంటల సమయంలో నానబెట్టి తొక్క తీసిన బాదంపప్పును తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల రాత్రి సమయంలో మేల్కొనడం తగ్గడంతో పాటు నాణ్యమైన నిద్రను సొంతం చేసుకోవచ్చు. అరటిపండ్లు కూడా నిద్రపోవడానికి సహాయం చేస్తాయని చెప్పవచ్చు. అరటిపండ్లల్లో పొటాషియం, మెగ్నీషియం, ట్రిప్టోఫాన్ వంటి పోషకాలు కలిసి ఉంటాయి. అరటిపండును తీసుకోవడం వల్ల నిద్ర చక్రాలను నియంత్రించే మెలటోనిన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. భోజనం తరువాత లేదా రాత్రి భోజనం తరువాత అరటిపండును తీసుకోవడం వల్ల తగినంత విశ్రాంతిని పొందవచ్చు. ఇక నిద్రపోయే ముందు గోరు వెచ్చని పాలల్లో పసుపు కలిపి తీసుకోవడం వల్ల సహజంగా ప్రశాంతమైన నిద్రను సొంతం చేసుకోవచ్చు. ఇందులో చిటికెడు జాజికాయ పొడిని కలిపి తీసుకోవడం వల్ల తక్కువ నిద్ర ఉన్న వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
అదే విధంగా నిద్రకు ఉపయోగపడే మరో ఆహారం చెర్రీలు. ఇవి శరీరాన్ని చల్లబరిచే శక్తిని కలిగి ఉంటాయి. నిద్రకు భంగం కలిగించే అసమతుల్యతలను తగ్గించడంలో ఇవి సహాయపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల మెలటోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. సాయంత్రం సమయంలో తాజా చెర్రీపండ్లను తీసుకోవడం వల్ల రాత్రి సమయంలో సహజంగా నిద్ర వస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు. ఇటువంటి ఆహారాలను తీసుకుంటూనే జీవనశైలిలో మార్పులు కూడా చేసుకోవాలి. రాత్రిపూట స్క్రీన్ వాడకాన్ని తగ్గించడం, కెఫిన్ ను తక్కువగా తీసుకోవడం, రాత్రి సమయంలో ఆలస్యంగా భారీ భోజనాలు చేయడాన్ని తగ్గించడం, ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం వంటి వాటిని పాటించడం వల్ల సహజంగా నిద్రను సొంతం చేసుకోవచ్చు. అలాగే ఒకే సమయానికి నిద్రించడం, మేల్కొవడం వంటి వాటిని అలవాటు చేసుకోవాలి. ఇలా తగిన ఆహారాన్ని తీసుకుంటూ, చక్కటి జీవనశైలిని పాటించడం వల్ల నిద్ర సమస్యల నుండి సహజంగా బయటపడవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.