ముంబై: ముఖానికి ముసుగు ధరించిన ఒక వ్యక్తి బ్యాంక్‌లోని ప్రవేశించాడు. ఒక సంచిలో కారం తెచ్చిన అతడు అక్కడున్న బ్యాంక్ సిబ్బంది ముఖాలు, కళ్లల్లో చల్లాడు. గందరగోళానికి గురైన సిబ్బంది భయంతో పరుగులు తీశారు. ఈ నేపథ్యంలో కౌంటర్లో ఉన్న రూ.4 లక్షల డబ్బుతో ఆ వ్యక్తి పారిపోయాడు. (Man Throws Chilli Powder At Bank Staff) సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో నాగ్‌పూర్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్యాంక్ బ్రాంచ్‌లోకి ఒక వ్యక్తి ప్రవేశించాడు. ఎర్ర కుర్తా, నల్ల పైజామా ధరించిన అతడు ముఖానికి ముసుగువేసుకున్నాడు.
కాగా, ఆ వ్యక్తి తన వెంట తెచ్చిన సంచిలో ఉన్న కారం పొడిని బ్యాంక్ సిబ్బందిపై విసరడం ప్రారంభించాడు. బ్యాంకు ఉద్యోగుల కళ్లలో అతడు కారం చల్లడంతో వారు ఏమీ చూడలేక ఇబ్బందిపడ్డారు. భయంతో కౌంటర్ల నుంచి పరుగులు తీశారు. ఈ గందరగోళం మధ్య ఆ వ్యక్తి ఒక కౌంటర్లోకి దూకాడు. అక్కడ ఉన్న రూ.4 లక్షలు తీసుకుని పారిపోయాడు. కొందరు బ్యాంకు ఉద్యోగులు, ఒక సెక్యూరిటీ గార్డు అతడిని వెంబడించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
మరోవైపు ఆ వ్యక్తి కారం దాడి నుంచి తేరుకున్న బ్యాంక్ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. బ్యాంకు లోపల, బయట ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు. నిందితుడు పారిపోయిన దిశను గుర్తించి పెట్రోలింగ్ బృందాలను అప్రమత్తం చేశారు.
ఈ నేపథ్యంలో బ్యాంక్ దోపిడీ జరిగిన 30 నిమిషాల్లోనే పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్ నుంచి అతడు దొంగిలించిన రూ.4 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ బ్యాంక్‌లోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
महाराष्ट्र –
नागपुर के SBI में एक लुटेरा घुसा। बैंककर्मियों पर लाल मिर्च का पाउडर फेंका और 4.53 लाख रुपए लूटकर ले गया। कुछ देर बाद ही लुटेरा सूरज बोरकर पकड़ा गया। pic.twitter.com/Dxz3G6vRcD— Sachin Gupta (@Sachingupta) September 11, 2026