Hyderabad | హైదరాబాద్ మణికొండలోని నెక్నాంపూర్ ప్రాంతంలో చెడ్డీ గ్యాంగ్ కలకలం రేపింది. ఆదివారం తెల్లవారుజామున 3.20 గంటల సమయంలో ఫ్లోటిల్లా అపార్ట్మెంట్లోకి సుమారు ఆరుగురు అనుమానితులు చొరబడినట్లు పోలీసులు గుర్తించారు. చెరువు వైపు ఉన్న ఫెన్సింగ్‌ను కత్తిరించి అపార్ట్మెంట్లోకి ప్రవేశించిన వారు సీ బ్లాక్ మెట్ల మార్గం ద్వారా ఓ ఫ్లాట్‌లోకి వెళ్లి విలువైన వస్తువులను అపహరించినట్లు తెలుస్తోంది.
అదే సమయంలో అనుమానాస్పద వ్యక్తులను గుర్తించిన అపార్ట్‌మెంట్‌కు చెందిన ఓ మహిళ వారిని ప్రశ్నించగా.. ఆమెపై దురుసుగా ప్రవర్తించి ఆయుధాలతో దాడికి యత్నించినట్లు సమాచారం. దీంతో అపార్ట్మెంట్ వాసులు భయాందోళనకు గురయ్యారు.
విషయం తెలుసుకున్న నార్సింగి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అపార్ట్మెంట్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అనుమానితుల కదలికలను గుర్తించి వారిని పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నెక్నాంపూర్, అల్కాపూర్ టౌన్షిప్ పరిసరాల్లో రాత్రి వేళ పెట్రోలింగ్‌ను మరింత పెంచాలని స్థానికులు కోరుతున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, ఏదైనా అనుమానాస్పద కదలికలు గుర్తించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.