పరిగి, సెప్టెంబర్ 12 : అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే చెప్పిన అబద్ధంపై రైతులు భగ్గుమన్నారు. ఏకంగా ఎమ్మెల్యే ఇంటినే శనివారం ముట్టడించి మాట తప్పడంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడుతూ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు పరిగి మండలంలోని కాళ్లాపూర్, రాపోల్, దోమ మండలంలోని మూడు గ్రామాల రైతులు భూములు ఇచ్చారని, పరిశ్రమలు నెలకొల్పాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై ఆగ్రహించిన కాళ్లాపూర్ రైతులు రోడ్డెక్కారు. ఏకంగా పరిగిలో ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే ఇంట్లో లేరని తెలిసి బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై సాయంత్రం వరకు ఆందోళన కొనసాగించారు. పరిగి మండలం కాళ్లాపూర్, రాపోల్ గ్రామాల పరిధిలో 1197 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం భూ సేకరణ నోటిఫికేషన్ ఇచ్చింది.
కాళ్లాపూర్ గ్రామ రైతులు జూన్ 11వ తేదీన గ్రామంలోనే ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. దీంతో రైతుల పట్టా పొలాలు తీసుకోబోమని, కాళ్లాపూర్‌లో గ్రామసభ నిర్వహించబోమని స్థానిక ఎమ్మెల్యే హామీతో రైతులు దీక్ష విరమించారు. కానీ శుక్రవారం అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే మాట మార్చడంతో రైతులంతా అవాక్కయ్యారు. భూములు ఇచ్చామని అసెంబ్లీ సాక్షిగా అబద్ధం చెప్పడంపై మండిపడ్డారు. జాతీయ రహదారిపై మధ్యాహ్నం ప్రారంభమైన ధర్నా రాత్రి వరకు కొనసాగింది. ఆందోళన విరమించాలని పోలీసులు కోరినా ఎమ్మెల్యే వచ్చి సమాధానం చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. తమ భూముల జోలికి రాబోమని ఎమ్మెల్యే హామీ ఇవ్వాలని తేల్చిచెప్పారు. మున్సిపల్ మాజీ చైర్మన్ ముకుంద అశోక్, బీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్, శ్రావణ్‌రెడ్డి, కౌన్సిలర్లు రవికుమార్, నరేశ్ సంఘీభావం తెలిపారు. రోడ్డుపైనే భోజనాలు చేసేందుకు రైతులు ఉపక్రమించగా, పోలీసులు అడ్డుకున్నా రు. దీంతో రైతులు ఆగ్రహంతో భోజనాలు చే యకుండానే ఆందోళన కొనసాగించారు. రాత్రి వరకు ఆందోళన కొనసాగుతూనే ఉన్నది.
మా గ్రామానికి పార్కులు వద్దు. పరిశ్రమలు అవసరం లేదు. పరిగి నియోజకవర్గంలో నాలుగు విద్యుత్ సబ్స్టేషన్లు అవసరమా ? పంటలు సాగయ్యే భూముల నుంచి ప్రధాన విద్యుత్‌లైను తీసుకువెళ్తే ఎవరికి లాభమవుతుంది. ఇపుడున్న కరెంటే సరిగ్గా ఇస్తే చాలు. అభివృద్ది చేస్తామంటే నమ్మినం. ఉదయం నుంచి మహిళలు సైతం ధర్నా చేస్తుంటే కనీస స్పందన లేదు. ఒక్క అధికారి వచ్చి మాతో మాట్లాడింది లేదు. ఎవరిని నమ్మాలి. ఎక్కడ ప్రజాపాలన, ఎక్కడ ఇందిరమ్మ రాజ్యం నడుస్తున్నది ? పోలీసులు వచ్చి మీరు లేవండని బెదిరిస్తున్నారు. మేం చేసిన తప్పేంది? ప్రజాపాలన అంటూనే మమ్మల్ని రోడ్డున పడేశారు.