లక్నో: ఒక యువతి కారు లోన్ కోసం ధరఖాస్తు చేసింది. అప్లికేషన్ ధృవీకరణ కోసం తన తండ్రి వద్దకు వెళ్లింది. ఆయన నిరాకరించడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన కుమార్తె తన వద్ద ఉన్న గన్‌తో తండ్రికి గురిపెట్టింది. కాల్పులు జరిపి చంపుతానని బెదిరించింది. స్థానికులు గుమిగూడటంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. (Daughter points gun at father) ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. హితేష్ తోమర్ అనే వ్యక్తి సాహిబాబాద్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఆయన కుమార్తె అయిన 30 ఏళ్ల ప్రియాంక గత రెండేళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటున్నది.
కాగా, సెప్టెంబర్ 8న సాయంత్రం 5 గంటల సమయంలో ప్రియాంక తన స్నేహితురాలితో కలిసి తండ్రి నివసిస్తున్న ఇంటికి చేరుకున్నది. కారు రుణం కోసం తాను దరఖాస్తు చేసినట్లు చెప్పింది. లోన్ అప్లికేషన్‌ను ధృవీకరించాలని తండ్రి హితేష్‌ను కోరింది. ఆయన నిరాకరించడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవ సమయంలో ప్రియాంక తన తండ్రిపై దాడి చేసినట్లు స్థానికులు ఆరోపించారు. వదిన జోక్యం చేసుకోగా ఆమెపై కూడా ఘర్షణకు దిగినట్లు తెలిపారు.
మరోవైపు ఈ గందరగోళాన్ని పొరుగువారు గమనించడంతో ప్రియాంక తన స్నేహితురాలితో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే 25 నిమిషాల తర్వాత తన ఫ్రెండ్‌తో కలిసి మళ్లీ తండ్రి ఇంటి వద్దకు వచ్చింది. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రియాంక గేటును బలవంతంగా తెరిచి ఇంట్లోకి ప్రవేశించింది. తండ్రి, వదినల వైపు పిస్టల్ గురిపెట్టి వారిని చంపేస్తానని ఆమె బెదిరించింది. అయితే స్నేహితురాలు జోక్యం చేసుకుని ప్రియాంకను అక్కడి నుంచి లాక్కెళ్లింది.
కాగా, సంఘటన పట్ల హితేష్ తోమర్ చాలా కలత చెందారు. కుమార్తె ప్రియాంక తనపై తుపాకీ ఎక్కుపెట్టి బెదిరించడంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. ఆధారాల కోసం సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ప్రియాంక, ఆమె స్నేహితురాలిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే తండ్రిని గన్‌తో కుమార్తె బెదిరించిన సీసీటీవీ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
UP: Daughter’s high-voltage drama in Ghaziabad!
The daughter flew into a rage when her father refused to undergo the verification process for a car loan. It is alleged that she first verbally abused and scuffled with her father and sister-in-law; about 25 minutes later, she… pic.twitter.com/r4GrpmxyzL
— Siraj Noorani (@sirajnoorani) September 11, 2026