ఖాఠ్మండూ: రెస్క్యూ ఆపరేషన్ సందర్భంగా మత్తులో ఉన్న చిరుతపులిని అటవీశాఖ కార్యాలయానికి సిబ్బంది తరలించారు. అయితే ఎన్‌క్లోజర్‌లో ఉంచే సమయంలో ఆ చిరుతకు మత్తు వీడింది. బోను నుంచి బయటపడిన అది అటవీ శాఖ సిబ్బందిపై దాడి చేసింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Leopard Breaks Cage And Attacks) నేపాల్‌లోని లమ్జుంగ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్ 10న బేసిసహర్లోని ధుంగ్ ఖోలా ప్రాంతంలో సంచరిస్తున్న చిరుతకు మత్తు మందు ఇచ్చి అటవీశాఖ అధికారులు బంధించారు. లమ్జుంగ్ డివిజన్ అటవీ కార్యాలయానికి వాహనంలో దానిని తరలించారు.
కాగా, చిరుతను బంధించిన బోనును ఇద్దరు వ్యక్తులు వాహనం నుంచి కిందకు దించారు. అటవీ కార్యాలయం ఆవరణలోని నేలపై ఉంచారు. ఒక ఎన్‌క్లోజర్‌లోకి దానిని తరలించేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో ఉన్నట్టుండి మత్తులో ఉన్న ఆ చిరుత అకస్మాత్తుగా చురుకుగా మారింది. బోను తలుపును బలవంతంగా తెరిచి బయటకు దూకింది. అక్కడ ఉన్న అటవీశాఖ సిబ్బందిపై అది దాడి చేసింది. ఒక వ్యక్తి చేతిని గట్టిగా కొరింది. ఇది చూసి అక్కడున్న వారంతా భయంతో దూరంగా పారిపోయారు.
మరోవైపు బోను నుంచి తప్పించుకున్న ఆ చిరుత అటవీశాఖ కార్యాలయంలోని ఆవరణలో అటూ ఇటూ తిరిగింది. ఒక స్తంభాన్ని ఎక్కడానికి అది ప్రయత్నించింది. చివరకు అటవీశాఖ సిబ్బంది ఆ చిరుతను బంధించారు. ఎన్‌క్లోజర్‌లో దానిని ఉంచారు. చిరుత దాడిలో గాయపడిన 57 ఏళ్ల అటవీ శాఖ గార్డు బుద్ధి జంగ్ గురుంగ్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
అయితే చిరుత తప్పించుకుందన్న సమాచారం తెలియడంతో ఆ అటవీశాఖ కార్యాలయం ముందు జనం పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ఏం జరుగుతుందోనని ఆసక్తిగా గమనించారు. కాగా, బోను నుంచి బయటపడిన ఆ చిరుత అటవీ శాఖ గార్డుపై దాడి చేసిన షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
नियन्त्रणमा लिएको चितुवा फुत्किएर लमजुङ डिभिजन वन कार्यालय मै भयो यस्तो… pic.twitter.com/CpM8Ag1iod
— Nirmal Prasai🇳🇵 (@NirmalPrasai5) September 11, 2026