– ‘నమస్తే వెబ్’ కథనానికి స్పందన
– విజిలెన్స్ బృందంతో విచారణకు వచ్చిన ఖమ్మం ఆర్ఎల్సీ అరుణకుమారి
బూర్గంపహాడ్, సెప్టెంబర్ 12 : బూర్గంపహాడ్ మండలం సారపాక మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల కళాశాల వసతి గృహంలో విద్యార్ధినులపై ఎలుకలు దాడి చేసిన ఘటనపై శనివారం ‘వసతి గృహం విద్యార్ధినులపై ‘ఎలుకల దాడి’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ వెబ్’ లో కథనం ప్రచురితమైంది. దీనికి ఖమ్మం ఆర్ఎల్సీ (రీజనల్ లెవల్ కోఆర్డినేటర్) అరుణకుమారి స్పందించి విజిలెన్స్ బృందంతో హుటాహుటీన సారపాక మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల కళాశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. కళాశాల వసతిగృహంలో ఎలుకల దాడికి గురైన విద్యార్థినులను పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కళాశాల ప్రిన్సిపాల్, వార్డెన్లను పిలిపించి దాడికి గల కారణాలను, జరిగిన పరిణామాలపై విచారణ చేపట్టి నివేదిక తయారుచేశారు. ఎలుకల దాడి ఘటన ఈ నెల 3, 6, 8వ తేదీల్లో జరిగిందని, ఈ దాడిలో మొదటిసారి ఇద్దరు, రెండవసారి నలుగురు, మూడవసారి ఒకరిని ఎలుకలు కరిచినట్లు (ఫస్టియర్‌లో నలుగురు, సెకండియర్‌లో ఇద్దరిని) ఆర్ఎల్సీ, విజిలెన్స్ బృందానికి ప్రిన్సిపాల్, వార్డెన్లు తెలిపారు.

విద్యార్ధినులపై ఎలుకల దాడి ఘటనకు స్పందించిన అధికారులు
ఈ సంఘటన జరిగిన వెంటనే విద్యార్ధినులను చికిత్స కోసం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లామని, ఇప్పటికే మూడు డోస్‌లు ఇంజక్షన్ ఇప్పించామని, మరో డోస్ ఈ నెల 18న వేయాల్సి ఉంటుందని వెల్లడించారు. దాడికి గురైన విద్యార్ధినుల్లో ఐదుగురు వసతి గృహంలో, మరో ఇద్దరు వారి తల్లిదండ్రులతో ఇంటికి వెళ్లినట్లు ఆర్ఎల్సీ తెలిపారు. ప్రస్తుతం ఎలుకలు బయటి నుంచి రాకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా విద్యార్ధినులపై ఎలుకలు దాడి చేశాయన్న సమాచారం తెలుసుకుని రావడం జరిగిందని, ఈ సమాచారం కళాశాల ప్రిన్సిపాల్, వార్డెన్ నుండి తమకు అందలేదని ఆమె స్పష్టం చేశారు. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, విచారణకు సంబంధించి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని ఆర్ఎల్సీ తెలిపారు. తనిఖీ చేసిన వారిలో విజిలెన్స్ అధికారులు కోమాకుల సీతారాములు, రిటైర్డ్ ఎస్ఐ మహ్మద్ రవూఫ్ ఉన్నారు.

విద్యార్ధినులపై ఎలుకల దాడి ఘటనకు స్పందించిన అధికారులు