రాయపోల్, మార్చి 5 : విద్యార్థులు చదువుపైనే పూర్తి దృష్టి పెట్టి కష్టపడి చదివితే భవిష్యత్తు బంగారుమయం అవుతుందని గజ్వేల్ రోటరీ క్లబ్ గవర్నర్ రాం ప్రసాద్ సూచించారు. గురువారం రాయపోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు గజ్వేల్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పాఠశాల కంప్యూటర్ ల్యాబ్‌కు 20 ప్లాస్టిక్ కుర్చీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివితే జీవితాంతం సుఖంగా జీవించవచ్చని అన్నారు.
విద్య అనేది ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చే గొప్ప ఆయుధమని, సమయాన్ని వృథా చేయకుండా చదువుపైనే దృష్టి సారించాలని విద్యార్థులకు రోటరీ క్లబ్ గవర్నర్ రాం ప్రసాద్ సూచించారు. లక్ష్యాన్ని నిర్ణయించుకొని పట్టుదలతో ముందుకు సాగితే ఎవరైనా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని ఆయన చెప్పారు.

అనంతరం ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు మంచి నీటి కొరత ఉందని నీటి శుద్దీకరణ యంత్రం కావాలని కోరారు. దీంతో రాం ప్రసాద్ రెండు నెలల్లో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఆర్వో ప్లాంట్ ఏర్పాటు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాసంపల్లి రాజు, ఉపసర్పంచ్ హనుమంతు రాజు, రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ జగదీశ్వర్, జిల్లా ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్, సెక్రెటరీ సాయి రెడ్డి, బాలకృష్ణ, రోటరీ క్లబ్ సభ్యులు కరుణాకర్ రెడ్డి, నరసింహా రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు మహేందర్ రెడ్డి, పుట్టరాజు, ఉషనగల్ల శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.