Upgradation | ఇంద్రవెల్లి: తెలుగు, హిందీ గ్రేడ్ 2, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను అప్గ్రేడ్ చేయాలని ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ (ATA) ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు గెడెం శ్యామ్సుందర్ కోరారు. ఏటీఏ ఇంద్రవెల్లి మండల శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్యామ్సుందర్ మాట్లాడుతూ… రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న గ్రేడ్ 2 తెలుగు, హిందీ, వ్యాయామ ఉపాధ్యాయ 423 పోస్టులను అప్గ్రెడేషన్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఈ విషయంపై పలుదఫాలుగా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా ఆర్థిక శాఖ నుంచి అనుమతి రాకపోవడంతో పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ, లోకల్ బాడీ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అప్గ్రెడేషన్ ద్వారా సుమారు 11,000 పదోన్నతులు కల్పించి 30 నెలల కావస్తుందని గుర్తు చేశారు. కానీ ప్రభుత్వం ఆదివాసీ ఉపాధ్యాయులను నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు.
చిన్న భూభాగమైన ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన అనేక జీవోలు, చట్టాలు అమలుకు నోచుకోవడం లేదని, రాష్ట్రంలో 668 మండలాల్లో 55 షెడ్యూల్డ్ ఏరియా (Scheduled Area) మండలాల్లో జీవో ఎంఎస్ నబర్ 3 స్థానంలో మరొక జీవో తీసుకురావాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతంలో రేషలైజేషన్ మినహాయింపు ఇవ్వాలని, అప్గ్రెడేషన్ అయిన ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్ట్ మంజూరు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులకు కల్పిస్తున్న హెల్త్ స్కీమ్ పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురావాలని, పెండింగ్ పీర్సీ, డీఏలను తక్షణమే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏటీఏ జిల్లా ప్రధాన నాయకులు కే బాజీరావు, సెడ్మకీ విద్యాసాగర్, జగనక్ పుండలిక్, బి సాయి గజనం, ఆత్రం తుకారామ్ , శ్రీనివాస్ పాల్గొన్నారు.