రాంచీ: రహదారి పక్కన ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఆ కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. మంత్రి కుమార్తెతో సహా నలుగురు వ్యక్తులు ఈ ప్రమాదంలో మరణించారు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. (Car Rams Parked Truck ఝార్ఖండ్‌లోని జంషెడ్పూర్ నగరంలో ఈ సంఘటన జరిగింది. గురువారం తెల్లవారుజామున మెరైన్ డ్రైవ్ రోడ్డు పక్కన బ్రేక్‌డౌన్ వల్ల నిలిచి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదం ధాటికి ఆ కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.
కాగా, ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దీపికా పాండే సింగ్ కుమార్తె త్రిషా సింగ్‌తో సహా నలుగురు వ్యక్తులు ఈ ప్రమాదంలో మరణించారు. మిగతా ముగ్గురు మృతులను సార్థక్ అగర్వాల్, నమన్ గుప్తా, వంశిక ఖండేల్వాల్గా పోలీసులు గుర్తించారు. ఈ నలుగురు 12వ తరగతి విద్యార్థులని తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
మరోవైపు ఝార్ఖండ్ మంత్రి దీపికా పాండే సింగ్ కుమార్తె త్రిషా సింగ్ రోడ్డు ప్రమాదంలో మరణించడం పట్ల ఆ రాష్ట్ర గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఇతర రాజకీయ పార్టీల నేతలు, ప్రముఖులు సంతాపం తెలియజేశారు.