హైదరాబాద్ : యువతకు ఇచ్చిన హామీ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నిం టినీ వెంటనే భర్తీ చేయాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చాక ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామని బీజేపీ, 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీలు నిరుద్యోగ యువతకు,విద్యార్థులకు కల్లబొల్లి కబుర్లు చెప్పాయన్నారు. కాంగ్రెస్ సర్కార్ జాబ్ కేలండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీకి ఎటువంటి నోటిఫికేషన్లు జారీ చేయకపోవడంతో ఖమ్మం జిల్లా న్యూలక్మీపురంకు చెందిన వేణుకుమార్ ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర విచారకరమన్నారు.
దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయన త్వరితగతిన కోలుకోవాలని ఎంపీ రవిచంద్ర ఒక ప్రకటనలో ఆకాంక్షించారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ యువ డిక్లరేషన్ పేరిట సరూర్ నగర్ స్టేడియంలో 2023 మే 8వతేదీన బహిరంగ సభ పెట్టి తాము అధికారంలోకి వచ్చాక ఏటా 2లక్షల ఉద్యోగాలిస్తామన్న హామీని గత నెల 18న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదే చోట జరిగిన మీటింగులో మరోసారి గుర్తు చేశారన్నారు. నిరుద్యోగులకు ప్రతి నెల 4వేల చొప్పున భృతి అందజేస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనడాన్ని ఎంపీ రవిచంద్ర ప్రస్తావించారు.
కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలో 10వేల ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేదని, పోలీస్ శాఖలో 20వేల ఖాళీలు ఉంటే కేవలం 7,400 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడంతో యువత మండిపడుతున్నదన్నారు. విద్యార్థులు, యువత, అధ్యాపకులను ఉద్దేశించి క్రిమినల్ వేస్ట్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడాన్ని ఎంపీ రవిచంద్ర తప్పుబట్టారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ మేరకు ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటి భర్తీకి నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను ఎంపీ రవిచంద్ర డిమాండ్ చేశారు.
పేద కుటుంబానికి చెందిన వేణుకుమార్ వెంటనే కోలుకునేందుకు మెరుగైన వైద్య సేవలందించడంతో పాటు పక్కా ఇంటిని నిర్మించి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. బీఆర్ఎస్ అండగా ఉంటుందని, అధికారంలోకి వచ్చాక ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేస్తుందని ఎంపీ వద్దిరాజు హామీనిస్తూ.. ఆత్మహత్యలకు పాల్పడకుండా మరింత శ్రద్ధతో తమ చదువులు కొనసాగించాల్సిందిగా విద్యార్థులు, యువతకు హితవు పలికారు.