మాగనూరు : మండల కేంద్రం మాగనూరు మీదుగా నిర్మించనున్న భారత్మాల ( Bharat Mala ) రహదారి బైపాస్కు సంబంధించి భూసేకరణ వ్యవహారం మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. తమ భూములకు ప్రభుత్వం నిర్ణయించిన పరిహారం సరిపోవడం లేదని పేర్కొంటూ బాధిత రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా కోర్టు స్టే (Court Stay ) ఆర్డర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో స్టే అమల్లో ఉన్నప్పటికీ అధికారులు తమ పొలాల్లో పనులు చేపట్టేందుకు ప్రయత్నించారని రైతులు ఆరోపించారు.
మంగళవారం రెవెన్యూ, ఎన్హెచ్ఏఐ అధికారులు మక్తల్, ఊట్కూర్, నారాయణపేట తదితర పోలీస్స్టేషన్లకు చెందిన సిబ్బంది సమక్షంలో రహదారి పనులు చేపట్టేందుకు అధికారులు ప్రయత్నించారని ఆరోపించారు. కోర్టు ఆదేశాలను గౌరవించి పనులు నిలిపివేయాలని వారు అధికారులను కోరారు. అయినప్పటికీ అధికారులు తమ పొలాల్లోకి వచ్చి పనులు చేపట్టేందుకు ప్రయత్నించడంతో రైతులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రైతులు, అధికారుల మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది.
తమకు న్యాయం జరిగే వరకు భూముల్లో పనులు చేపట్టేందుకు అనుమతించబోమని రైతులు స్పష్టం చేశారు. రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవడంతో చివరకు అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు. కోర్టు ఆదేశాలు అమలు చేయాల్సిందే .తమ జీవనాధారమైన భూములను రహదారి నిర్మాణం కోసం తీసుకుంటున్న ప్రభుత్వం ముందుగా న్యాయబద్ధమైన పరిహారం నిర్ణయించాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు.
కోర్టు నుంచి స్టే ఆర్డర్ ఉన్న సమయంలో పనులు చేపట్టేందుకు ప్రయత్నించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానం ఆదేశాలను అధికారులు గౌరవించి, తమకు న్యాయం జరిగే వరకు భూముల్లో ఎలాంటి పనులు చేపట్టవద్దని కోరారు. భూములు కోల్పోతున్న రైతుల అభ్యంతరాలను పరిష్కరించకుండా పోలీసు బలగాల సమక్షంలో పనులు చేపట్టేందుకు ప్రయత్నించడం వల్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోందని స్థానికులు పేర్కొన్నారు.