– ఫ్యాకల్టీలుగా మహిళా అభ్యర్థులకు అవకాశం
– అక్టోబర్ 1 సాయంత్రం 4 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలి
– కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సి.హెచ్.వెంకటరమణ
రుద్రంపూర్, సెప్టెంబర్ 29 : కొత్తగూడెం ఏరియా సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత వృత్తి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సి.హెచ్.వెంకటరమణ తెలిపారు. మగ్గం వర్క్, టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటిషన్ వర్క్, జ్యూట్ బ్యాగుల తయారీలో శిక్షణ ఇచ్చేందుకు ఆసక్తి ఉన్న మహిళా ఫ్యాకల్టీల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఫ్యాకల్టీగా దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులు కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత వృత్తి శిక్షణలో సర్టిఫికెట్ కలిగి ఉండటంతోపాటు కనీసం ఒక సంవత్సరం ఫ్యాకల్టీగా అనుభవం ఉండాలని తెలిపారు. మగ్గం వర్క్, టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటిషన్ వర్క్, జ్యూట్ బ్యాగుల తయారీలో శిక్షణ పొందిన సర్టిఫికెట్లు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు.
అదేవిధంగా సింగరేణి ఉద్యోగుల గృహిణులు, వారి కుటుంబాల్లోని నిరుద్యోగ యువతులు, పరిసర ప్రాంతాల మహిళలు సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత వృత్తి శిక్షణ తరగతుల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని జీఎం తెలిపారు. ఆసక్తి ఉన్న మహిళలు అక్టోబర్ 1వ తేదీ సాయంత్రం 4 గంటల్లోపు కొత్తగూడెం ఏరియా పర్సనల్ డిపార్ట్మెంట్లో దరఖాస్తులు సమర్పించాలని ఆయన సూచించారు.