Ghee | భారతీయ వంటకాలలో నెయ్యికి ప్రత్యేక స్థానం ఉంది. పప్పు, అన్నం, చపాతీలతో పాటు పండుగల సమయంలో తయారుచేసే స్వీట్లలోనూ నెయ్యిని విస్తృతంగా ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలోనూ నెయ్యికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే నెయ్యి ఆరోగ్యానికి మేలు చేస్తుందనే నమ్మకంతో పరిమితి లేకుండా తీసుకోవడం మాత్రం సమస్యలకు దారితీస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. నెయ్యిలో కొవ్వు, ముఖ్యంగా సంతృప్త కొవ్వు అధికంగా ఉంటుంది. సుమారు 100 గ్రాముల నెయ్యిలో 883 కిలోకేలరీల శక్తి ఉంటుంది. అందువల్ల నెయ్యి నాణ్యతతోపాటు తీసుకునే పరిమాణంపై కూడా శ్రద్ధ పెట్టడం అవసరం.
రోజువారీ ఆహారంలో నెయ్యి పరిమాణం పెరిగితే శరీరంలో సంతృప్త కొవ్వు అధికమవుతుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. అధిక కొలెస్ట్రాల్ కాలక్రమేణా రక్తనాళాల గోడలపై పేరుకుపోయి వాటిని ఇరుకుగా మార్చే అవకాశం ఉంటుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ముఖ్యంగా భారతీయుల్లో బయటకు సన్నగా కనిపించినప్పటికీ శరీరంలో కొవ్వు నిల్వలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ఆసియా ప్రజలకు అధిక బరువును అంచనా వేసే బాడీ మాస్ ఇండెక్స్ పరిమితిని 23గా పరిగణిస్తారు.
ఆరోగ్యకరమైన పెద్దలు రోజుకు ఒకటి నుంచి రెండు టీస్పూన్ల నెయ్యిని మొత్తం వంట కొవ్వుల పరిమితిలో భాగంగా తీసుకోవాలి. నెయ్యి, నూనెలు, వెన్న వంటి అన్ని కొవ్వులు కలిపి రోజుకు సుమారు 20 నుంచి 50 గ్రాముల మధ్య ఉండేలా చూసుకోవాలి. ఇది వ్యక్తి శారీరక చురుకుదనాన్ని బట్టి మారుతుంది. రోజువారీ శక్తి అవసరాల్లో సంతృప్త కొవ్వు వాటా 7 శాతానికి మించకుండా చూసుకోవడం మంచిది. ఇప్పటికే గుండె జబ్బులు, మధుమేహం లేదా అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు నెయ్యి పరిమాణాన్ని మరింత తగ్గించాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో రోజుకు ఒక టీస్పూన్ వరకు పరిమితం చేయడం, మిగతా వంటలకు ఆవాలు, వేరుశెనగ, నువ్వుల నూనెలను ఉపయోగించడం సూచించారు.
అయితే నెయ్యిని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. వంటలో ఎక్కువగా వేయడం కంటే చివర్లో రుచి, సువాసన కోసం కొద్దిగా ఉపయోగించడం మంచిది. ఉదాహరణకు, పప్పు లేదా ఇతర వంటకాలపై కొద్దిగా నెయ్యి వేసుకోవడం ద్వారా రుచిని ఆస్వాదించవచ్చు. ముఖ్యంగా నెయ్యిని అంచనా లేకుండా పోయడం కాకుండా టీస్పూన్తో కొలిచి ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి. నెయ్యి ఆరోగ్యానికి పూర్తిగా హానికరమైన పదార్థం కాదు. అయితే పరిమితికి మించి తీసుకుంటే సంతృప్త కొవ్వు, అధిక కేలరీల కారణంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి పరిమిత పరిమాణంలో తీసుకోవడమే ఆరోగ్యకరమైన విధానమని నిపుణులు చెబుతున్నారు.