Stock Markets : దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇరాన్ (Iran) తో చర్చలు ఉంటాయని ప్రకటించడంతో పశ్చిమాసియా (West Asia) లో ఉద్రిక్తతలు చల్లారాయి. దాంతో చమురు ధరలు మరోసారి దిగొచ్చాయి. విదేశీ మదుపర్ల పెట్టుబడులు కలిసొచ్చాయి. దాంతో సూచీలు వరుసగా నాలుగో సెషన్లోనూ లాభాల్లో ముగిశాయి. మదుపర్ల సంపద ఒక్క సెషన్లోనే రూ.5 లక్షల కోట్ల మేర పెరిగింది.
ఇవాళ ఉదయం సెన్సెక్స్ 78,883.34 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 78,094.64) లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కదలాడింది. ఇంట్రాడేలో 78,895.10 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి సెన్సెక్స్ 544.39 పాయింట్లు లాభపడి 78,639.03 వద్ద ముగిసింది. నిఫ్టీ 390.70 పాయింట్లు పెరిగి 24,774.30 వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.31 వద్ద ఉంది. సెన్సెక్స్ 30లో ఇండిగో, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎటర్నల్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.
సన్‌ఫార్మా, భారతీ ఎయిర్టెల్, మారుతీ, టాటాస్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్ షేర్లు నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ ధర 83.83 డాలర్ల వద్ద కొనసాగుతోంది. బంగారం ఔన్స్ ధర 4,054.64 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.