Devendra Fadnavis : సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ప్రస్తుతం ముంబై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అన్నా హజారేను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం ఉదయం పరామర్శించారు. హజారే చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి, ఆయన ఆరోగ్య స్తితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్‌తో రాష్ట్ర మంత్రి గిరిష్ మహాజన్ హజారేనే పరామర్శించారు.
ఈ సందర్భంగా అన్నా హజారేతో సీఎం మాట్లాడారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వందేళ్లు బతకాలని కోరుకున్నారు. ఇదే సమయంలో కుక్డి జలవనరుల ప్రాజెక్టుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందనే విషయాన్ని హజారేకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వివరించారు. దీనిపై హజారే హర్షం వ్యక్తం చేశారు. 89 ఏళ్ల హజారే ఇటీవల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. దీంతో ముంబై ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. అయితే, ఆయన ఆరోగ్యం మెరుగైందని, ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
అన్నా హజారేకు సామాజిక ఉద్యమకారుడిగా పేరుంది. దేశంలో ఆయన అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. గతంలో ఆర్మీలో పని చేసిన ఆయన తర్వాత పలు ఉద్యమాలు చేశారు. అవినీతికి వ్యతిరేకంగా 2011లో ఆయన చేసిన ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అవినీతిని అరికట్టే లోక్‌పాల్ బిల్లు కోసం ఆ సమయంలో హజారే ఉద్యమం చేశారు. హజారేకు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు ఇచ్చి సత్కరించింది.