హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో గ్రామీణ ఉపాధికి భారీగా గండిపడింది. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఉపాధి పనులు మందగించడం వల్ల కూలీల జీవనోపాధికి మరింత ఆందోళనకరంగా మారింది. గతంలో ఉపాధి హామీ పనులు గ్రామీణ పేద కూలీల కుటుంబాలకు భరోసాగా ఉండగా, ఇప్పుడు పని దినాలు తగ్గడంతో కుటుంబ పోషణ భారంగా మారుతున్నది.
రాష్ట్రంలో వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్, అజీవికా మిషన్ (వీబీ-జీ-రామ్-జీ) పథకం కింద కల్పిస్తున్న ఉపాధి పనిదినాలు గణనీయంగా తగ్గడం ఆందోళన కలిగిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో 2024-25లో 1,222.87 లక్షల పనిదినాలు కల్పించగా, 2025-26లో ఆ సంఖ్య 731.63 లక్షలకు తగ్గింది. ఈ పథకం కింద ఉపాధి పొందిన గ్రామీణ కుటుంబాల సంఖ్య కూడా తగ్గింది. 2024-25లో 26.69 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించగా, 2025-26లో ఈ సంఖ్య 22.08 లక్షలకు పడిపోయింది. అంటే ఏడాది వ్యవధిలో 17.2 శాతం తగ్గుదల నమోదైంది.
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించడం, ప్రజలు జీవనోపాధిని కొనసాగించేందుకు తోడ్పడటమే ఈ పథకం లక్ష్యం. కానీ, ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో గ్రామీణ కుటుంబాలకు ఈ పథకం అక్కరకు రాకుండా పోతున్నది. చాలామంది కుటుంబాలు 100 రోజుల పనిని కూడా పూర్తి చేయలేకపోయాయి. 2024-25లో 92,688 కుటుంబాలు 100 రోజుల ఉపాధిని పూర్తి చేశాయి.
2025-26లో ఈ సంఖ్య కేవలం 23,228 కుటుంబాలకు పడిపోయింది. మరోవైపు పథకం నుంచి తొలగించిన జాబ్ కార్డుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. 2024-25లో 80,166 జాబ్ కార్డులు (3,35,542 మంది కూలీలు) తొలగించగా, 2025-26లో 1,25,980 జాబ్ కార్డులు (5,44,955 మంది కూలీలు) తొలగించారు. నకిలీ నమోదులు, శాశ్వత వలసలు, కూలీల మరణాల వల్లనే ఈ కార్డులను తొలగించినట్టు ప్రభుత్వం తెలిపింది.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) స్థానంలో వీబీజీ రామ్జీ అమల్లోకి వచ్చిన తర్వాత కూలీల హాజరును యాప్ ద్వారా నమోదు చేసే ప్రక్రియలో సమస్యలు ఎదురయ్యాయి. నేషనల్ మొబైల్ మానిటరింగ్ సర్వీస్ (ఎన్ఎంఎంఎస్), ఈ-కేవైసీ ద్వారా హాజరు నమోదు, ఇతర వివరాలను అప్లోడ్ చేసే సమయంలో తొలుత రాష్ట్రంలో సాంకేతిక, నిర్వహణపరమైన ఇబ్బందులు తలెత్తాయి.
2026-27 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ -జూన్ మధ్య 649.58 లక్షల పనిదినాలు కల్పించారు. 2025-26 ఇదే కాలంతో పోలిస్తే ఇది 23 శాతం అధికమని అధికారులు తెలిపారు. ప్రస్తుతం 2024-25, 2025-26 సంవత్సరాలకు సంబంధించి ఎలాంటి వేతన బకాయిలు లేవని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఎల్ నినో ప్రభావంతో గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా (వీబీ-జీ-రామ్-జీ) పథకం కింద అదనపు పనులను చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. పథకంలో అదనపు కార్యకలాపాలను చేర్చడం ద్వారా గ్రామీణ ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడంతోపాటు పంటల వైవిధ్యీకరణకు కూడా ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నది.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను కూడా ఈ పథకం పరిధిలోకి తీసుకురావాలని కోరింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ విజ్ఞప్తులపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. వర్షాభావ పరిస్థితుల్లో గ్రామీణ కుటుంబాలకు అదనపు ఉపాధి అవకాశాల కల్పనపై ఇంకా స్పష్టత రావాల్సి ఉన్నది.