హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి పాలమూరును టీచర్ల కొరత వేధిస్తున్నది. జోగుళాంబ గద్వాల, నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లో ఈ సమస్య అధికంగా ఉన్నది. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం.. నారాయణపేట, వికారాబాద్ జిల్లాల కిందికే వస్తున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లానూ టీచర్ల కొరత వేధిస్తున్నది. ఈ నాలుగు జిల్లాల్లోనే వెయ్యి మందికిపైగా ఉపాధ్యాయుల అవసరమున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉర్దూ మీడియం బోధించే టీచర్ల కొరత సైతం విద్యా వ్యవస్థను పట్టిపీడిస్తున్నది. ఉర్దూ మీడియంలో 600 మంది ఉపాధ్యాయులు కావాల్సి ఉన్నది.
జోగుళాంబ గద్వాల జిల్లాలోని కేటీదొడ్డి, గట్టు, రాజోలి, అయిజ, గద్వాల, మానవపాడు మండలాల ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థులున్నా, పాఠాలు చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. నారాయణపేట జిల్లాలో 300 మంది, వికారాబాద్లో 150 మంది ఉపాధ్యాయుల కొరత ఉన్నది. వికారాబాద్లో దుద్యాల, దౌల్తాబాద్ మండలాల్లో ఈ సమస్య అధికంగా ఉన్నది. హైదరాబాద్ , సిద్దిపేట జిల్లాలో ఉర్దూ మీడియం టీచర్ల కొరత ఉన్నట్టు ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. టీచర్ల కొరతను అధిగమించేందుకు 1,600కు పైగా ఇన్స్ట్రక్టర్లను నియమించేందుకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపినట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు.