Viral News : ఆస్ట్రేలియా (Austrlia) లో వైద్య రంగాన్ని ఆశ్చర్యపరిచిన ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకే మహిళ ఒకే కాన్పులో ఇద్దరు శిశువులకు జన్మనిచ్చింది. అయితే ఆ ఇద్దరు పిల్లల తల్లిదండ్రులు వేర్వేరు కావడం ఈ కథలో అసలు విశేషం. ఈ అసాధారణ ఉదంతం క్విన్స్లాండ్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. క్విన్స్‌లాండ్‌కు చెందిన 27 ఏళ్ల మహిళ అప్పటికే ఐదుగురు పిల్లల తల్లి. గర్భాశయంలేని కారణంగా పిల్లలు కనలేని మరో జంట కోసం ఆమె సరోగసీ ద్వారా బిడ్డను కనడానికి ముందుకొచ్చింది.
ఒప్పందం ప్రకారం.. 2025 ఏప్రిల్‌లో వైద్యులు ఆ జంటకు చెందిన పిండాన్ని సరోగేట్ తల్లి గర్భంలోకి ప్రవేశపెట్టారు. అయితే సరిగ్గా అదే సమయంలో ఆమె తన భర్తతో సహజంగా కూడా గర్భం దాల్చింది. కొన్ని వారాల తర్వాత నిర్వహించిన అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో ఆమె గర్భంలో రెండు పిండాలు పెరుగుతున్నట్లు వైద్యులు గుర్తించారు. జన్యు పరీక్షలు చేయగా అసలు విషయం బయటపడింది. ఆ ఇద్దరిలో ఒకరు సరోగసీ కోరిన జంటకు చెందిన బిడ్డ కాగా.. మరొకరు (అబ్బాయి) సరోగేట్ తల్లి, ఆమె భర్తకు చెందిన సొంత బిడ్డ అని తేలింది. 2025 నవంబర్‌లో ఆమె సిజేరియన్ ద్వారా ఒకేసారి ఇద్దరు శిశువులకు జన్మనిచ్చింది.
ఈ ఘటనతో చట్టపరమైన చిక్కులు తలెత్తాయి. క్విన్స్‌లాండ్ సరోగసీ చట్టం ప్రకారం.. ఒకే కాన్పులో పుట్టిన తోబుట్టువులను విడదీయడం, ఒక బిడ్డకు మాత్రమే తల్లిదండ్రుల హక్కులు ఇవ్వడం సాధ్యం కాదు. దాంతో తాము కోరుకున్న జంట తమ కుమార్తెకు చట్టపరమైన హక్కుల కోసం కోర్టును ఆశ్రయించింది. ఈ అసాధారణ కేసును విచారించిన చిల్డ్రన్స్ కోర్ట్ న్యాయమూర్తి జోడీ వూల్డ్రిడ్జ్ ఒక చారిత్రక తీర్పు వెలువరించారు. ఇద్దరు శిశువులు ఒకే గర్భంలో పెరిగినప్పటికీ వేర్వేరు సమయాల్లో, వేర్వేరు పద్ధతుల్లో గర్భం దాల్చినందున వీరిని “జన్మతః తోబుట్టువులు” గా పరిగణించలేమని, కేవలం “గర్భాశయ కవలలు” గా మాత్రమే చూడాలని స్పష్టంచేశారు.
ఈ తీర్పుతో సరోగసీ కోరుకున్న జంటకు తమ కుమార్తెపై చట్టపరమైన హక్కులు లభించాయి. ప్రస్తుతం రెండు కుటుంబాలు తమతమ పిల్లలను సంతోషంగా పెంచుకుంటున్నాయి. ఆ ఇద్దరు పిల్లలకు వారి పుట్టుక వెనుక ఉన్న ప్రత్యేకతను తగిన వయసులో తెలియజేయాలని నిర్ణయించుకున్నారు.