హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): రేవంత్ పాలనలో ఎస్సీ అధికారులకు పోస్టింగ్ ఇవ్వడం లేదని బీఆర్ఎస్ పార్టీ ప్రధానకార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఎస్సీ వర్గానికి చెందిన ఆఫీసర్లు ఎవరూ లేరని ఎత్తిచూపారు. ఎవరైనా ఉంటే వివరాలు బయటపెట్టాలని సీఎం రేవంత్‌కు సవాల్ విసిరారు. ‘కనీసం మీ చుట్టూ ఉన్న ‘కలెక్షన్ బ్యాచ్’లో అయినా ఒక ఎస్సీ ఉన్నారా’ అని ప్రశ్నించారు. ఇకనైనా ముఖ్యమంత్రి ఎస్సీలపై చూపించే అవకాశవాద ప్రేమల డ్రామాలు బంద్ చేయాలని హితవుపలికారు. పిల్లి కండ్లు మూసుకుని పాలుతాగుతూ నన్నెవరూ చూడటం లేదనుకుంటే పొరపాటేనని చురకలంటించారు.
ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ‘మీ 25 సంవత్సరాల రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మీ వెంట తిరిగిన ఎస్సీలు ఎంతమంది? వాళ్లలో ఎంతమంది మీలాగా రియల్టర్లు/బిల్డర్లు అయ్యారు? విల్లాలు కొనుకున్నారు? ఎంతమంది ఫార్చ్యూనర్ కార్లు కొనుకున్నారు? కనీసం మారుతి కార్లయినా ఉన్నాయా?’ అని సీఎంను ప్రశ్నించారు. ‘మాదిగ ఉద్యోగులు అందరూ మీరేదో చేస్తారన్న ఆశతో శిల్ప కళావేదికలో ఒక మీటింగ్ పెట్టి మిమ్మల్ని ‘రేవంత్ మాదిగ’ అని ఆకాశానికి ఎత్తితే.. మీరు మీ అల్లుడి క్రషర్కు అక్రమ పర్మిషన్ ఇవ్వలేదని మాదిగ ఇంజినీర్ అంబేదర్ను రూ.200 కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నాయని అభియోగం మోపి జైలుకు పంపారు. ఇప్పుడు ఆ లెకలు తప్పని తలపట్టుకున్నరు. ఆయన ఉద్యోగం పోయి రోడ్ల మీద పడ్డారు. ఎంతమంది ఎస్సీ అధికారులకు మంచి పోస్టింగ్‌లు ఇచ్చిండ్రు మీరు? లెకలు తీయండి. మీరు-పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కక్షతో సస్పెండ్ చేసిన అధికారుల్లో మెజారిటీ వర్గం ఎస్సీ, ఎస్టీలే’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
మీరు ఆటోల్లో కుకి ఎర్రవల్లికి పంపిన డప్పు కళాకారులకు కూడా ఇప్పటివరకు జీతాలు ఎందుకు ఇవ్వలేదని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. వాళ్లు సమ్మె కూడా చేశారని గుర్తుచేశారు. ‘మీ హయాంలో అత్యంత పవిత్రమైన గౌలిదొడ్డి క్షేత్రాన్ని బందెలదొడ్డిగా మార్చారు. కర్ల రాజేశ్, ఎర్ర రాజశేఖర్‌లను చంపింది ఎవరు? వేముల వీరేశాన్ని పిర్రలు వాచేలా కొట్టమని చెప్పింది ఎవరు? మీరు కాదా? అసెంబ్లీలో వేముల వీరేశం పెట్టిన స్వీటును తాకకుండా తిరసరించింది ఎవరు? మందుల సామేలు ఇంటి మీద గుడ్లు వేయించింది ఎవరు? మీరు కాదా? చేవెళ్ల సాక్షిగా ఎస్సీలను మోసం చేసింది ఎవరు? యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహాహస్వామి దైవసన్నిధిలో ఎస్సీ మంత్రి భట్టి విక్రమార్కను నేలపై కూర్చోబెట్టింది ఎవరు?
గోచి కట్టుకున్న ప్రతోడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కాలేడని దెప్పిపొడిచింది ఎవరు? మీరు కాదా? స్పీకర్‌ను దళిత దళిత అని ప్రతిరోజూ చిత్రహింసలు పెట్టేదెవరు? మీరు కాదా?’ అని రేవంత్‌రెడ్డి తీరుపై ధ్వజమెత్తారు. ఎస్సీ మంత్రి లక్ష్మణ్‌కుమార్‌కు తెలవకుండా రూ.2,000 కోట్ల కుంభకోణానికి తెరలేపింది ఎవరని ప్రశ్నించారు. ‘ఎస్సీ అయిన బాలమల్లును కేసీఆర్ టీజీఐఐసీకి చైర్మన్‌ను చేస్తే మీరు జగ్గారెడ్డి భార్యను చేశారు. ఒక మాటలో చెప్పాలంటే కేసీఆర్ ప్రతి ఒక ఎస్సీని గుండెలో పెట్టి కాపాడుకున్నరు.
కానీ ఎన్నడూ చెప్పుకోలేదు. తన మనసులో ఉన్న ప్రేమను చేతల్లో చూపించారు. వేల కోట్లు పంచారు. మీరు ప్రతిరోజూ ఎస్సీలపై నకిలీ ప్రేమ ఒలకబోస్తూ వాళ్లను పాతాళానికి తొకుతున్నరు. కేసీఆర్ ఎస్సీలను పైలట్లుగా మారిస్తే, మీరు వాళ్లను ఇంకా పాలేరుల లాగానే చూస్తున్నరు. అందుకే అనుకుంటా.. దొర పాలేరును పంపించినట్టు మళ్లీ అదే వేముల వీరేశాన్ని భయపెట్టి ఎర్రవల్లికి డప్పులు ఇచ్చి మరీ బందోబస్తుతో పంపించారు’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ అంశాలపై మీరెకడ బహిరంగ చర్చకు రమ్మంటే అకడికి వస్తానని ఆర్ఎస్పీ సవాల్ విసిరారు.