సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : 22ఏ (నిషేధిత భూముల జాబితా) మంటలు సామాన్యుల జీవితాలను బూడిద చేస్తున్నాయి. దశాబ్దాలుగా తమ ఆస్తులేనని తమ కష్టార్జితంతో కొనుగోలు చేసిన ప్లాట్లు, ఇండ్లు రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలోకి చేరడంతో లక్షలాది మంది ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ‘మా చేతుల్లో ఏమీ లేదు.. ప్రభుత్వం నుంచి కొత్త మార్గదర్శకాలు వచ్చే వరకు ఏమీ చేయలేము’ అని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులు సైతం చేతులెత్తేస్తుండటంతో భూ యజమానులు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిగా స్తంభించిపోవడం, ఎన్వోసీలను ప్రభుత్వ యంత్రాంగాలు ఇవ్వకపోవడంతోబాధితులు తీవ్ర ఆర్థిక, మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. దీంతో ఉన్న ఆస్తులను అమ్ముకోలేక, అవసరానికి సొమ్ము చేసుకోలేక, రిజిస్ట్రేషన్ల కోసం తీసుకున్న అడ్వాన్స్‌లను తిరిగి చెల్లించలేక నానా అవస్థలు పడుతున్నారు.
అమలు కానీ హామీలు..
రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఆస్తి పత్రాలను సమర్పించగానే 22ఏ అనే సాంకేతిక అడ్డంకి తెరపైకి వస్తోంది. ఎన్వోసీల కోసం తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా.. ఫలితం కనిపించడం లేదు. దీంతో ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ ఉన్న మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల వాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వేలల్లో నిషేధిత జాబితాలో ఇరుక్కుపోయిన తమ ఆస్తులను చూసుకుని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 98 లక్షల ఎకరాల పరిధిలోని పలు సర్వే నంబర్లు, ప్లాట్లు నిషేధిత లేదా పరిశీలన రికార్డుల్లో ఉన్నట్లు అంచనా ఉంది. ఇందులో సంగారెడ్డి జిల్లాలో 25,000 ఎకరాలకు పైగా భూములు రిజిస్ట్రేషన్ కాక నిలిచిపోయాయి.
అదేవిధంగా 30 ఏండ్ల నాటి కాలనీలను కూడా 22ఏ మంటలు వెంటాడుతున్నాయి. పటాన్చెరు, అమీన్పూర్, బీరంగూడ పరిధిలోని ఇక్రిశాట్ ఫేజ్-2, మల్లికార్జున నగర్, వంటి కాలనీల్లో దాదాపు 200 ఎకరాల్లో విస్తరించిన పాత నివాస ప్రాంతాలను 22ఏ జాబితాలో చేర్చడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇక మేడ్చల్ జిల్లా పరిధిలో దాదాపు 10వేలకు పైగా ఇండ్లపై ప్రభావం పడుతుండగా… మేడ్చల్, కుత్బుల్లాపూర్‌లోని బహుళ కాలనీలు ఈ ఆంక్షలతో విలవిలలాడుతున్నాయి.
ఇటీవల ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా, సమీక్షా సమావేశాల్లో 22ఏ వివాదాల పరిషారానికి 30 నుంచి 45 రోజులలోపు కాలపరిమితితో కూడిన వ్యవస్థను తెస్తామని, కలెక్టర్ల స్థాయిలో కమిటీలు వేసి బాధితులకు న్యాయం చేస్తామని ప్రకటించింది. అయితే ఈ ప్రకటనలు కేవలం హామీలకే పరిమితం అవుతాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భూభారతి, రెవెన్యూ రికార్డులలో క్లరికల్ పొరపాట్ల వల్ల యూఎల్సీ, అసైన్డ్, సీలింగ్ భూములకు ఆనుకుని ఉన్న ప్రైవేట్ భూములను విచక్షణారహితంగా 22ఏ(1)(ఈ)లో చేర్చారు. వీటిని వర్గీకరించే విషయంలో దిగువ స్థాయి అధికారులకు నిర్దిష్టమైన జీవోలు ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు.
చివరకు గతంలో హెచ్ఎండీఏ, హుడా, పంచాయతీ అనుమతులు పొంది, లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి మున్సిపల్ పన్నులు చెల్లిస్తున్న వారికి కూడా ఇప్పుడు ఎన్వోసీలను అధికారులు మంజూ రు చేయడం లేదు. దీంతో అధికారుల చుట్టూ ఎన్వోసీలతోనైనా తీసుకునేందుకు భూ యజమానులు తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. కనీసం వాటితోనైనా రిజిస్ట్రేషన్ చేసుకుని, అత్యవసర వైద్య ఖర్చులు, పిల్లల చదువులు, వివాహాల కోసం ఉన్న ఆస్తిని అమ్ముకుందామన్నా, లేదా బ్యాంక్ లోన్ పొందుదామన్నా రిజిస్ట్రేషన్ కాక పౌరులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. కానీ సర్కార్ మార్గదర్శకాల పేరిట చేసిన ప్రకటన మరిం త జాప్యానికి కారణమవుతున్నది. ఇప్పుడు సర్కా ర్ మార్గదర్శకాలు ఇచ్చేంత వరకు భూముల రిజిస్ట్రేషన్లు చేసేది లేదని అధికారులు తేల్చి చెబుతున్నారు.
సర్కార్ తప్పిదం… తప్పని ఇబ్బందులు
విచక్షణారహితంగా ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టిన కాంగ్రెస్ సర్కార్ తప్పిదం ఇప్పుడు జనాలను వెంటాడుతూనే ఉంది. రెవెన్యూ యంత్రాంగం, సబ్ రిజిస్ట్రేషన్ శాఖల మధ్య సమాచార మార్పిడి లోపంతో జనాలను ఎందుకు ఇబ్బంది పెడుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. క్షేత్రస్థాయి విచారణ జరిగేంత వరకు భూ యజమానులకు 22-ఏ నుంచి మినహాయింపు ఇవ్వలేమని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికైన సమగ్ర మార్గదర్శకాలను జీవో రూపంలో విడుదల చేసి, సబ్ -రిజిస్ట్రార్, తహసీల్దార్ స్థాయిలలో స్పష్టమైన అధికారాలు అప్పగించాలన్నారు.
నిర్దిష్ట కాలపరిమితితో దరఖాస్తులపై బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. బాధితుల ఆవేదనను సర్కారు అర్ధం చేసుకుని, 22-ఏ మంటల నుంచి ఉపశమనం కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వసూళ్ల పర్వం
సమాచార హక్కు చట్టం కింద అడిగే ప్రశ్నలకు రిజిస్ట్రేషన్ శాఖ నిరాకరిస్తున్నది. 22ఏ ప్రక్రియ నిషేధిత ఆస్తుల రిజిస్ట్రేషన్లు, గ్రామ కంఠాల ఇండ్ల రిజిస్ట్రేషన్లు, జరిగిన ఇతర అక్రమాలపై సమాచారం అడిగితే భయపడుతోంది. తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల మేడ్చల్ జిల్లాలోని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల కమిషనర్‌కు సమర్పించిన వినతిపత్రంలో పలు దిగ్బ్రాంతికర విషయాలను వెల్లడించారు. గ్రామ కంఠాల ఇండ్ల రిజిస్ట్రేషన్లకు పర్మిషన్ లేదంటూనే, లక్ష చొప్పున అక్రమంగా వసూలు చేసి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని ఆరోపించారు. సేల్ డీడ్‌లో చిన్నచిన్న తప్పిదాల సవరణకు రూ. 20వేల నుంచి 50వేల వరకు డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు.
సీసీ కాపీ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా రూ. 20వేల నుంచి 50వేల వరకు డిమాండ్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇక వక్ఫ్ బోర్డు భూములను కూడా రిజిస్ట్రేషన్లు చేస్తూ వేలల్లో దండుకుంటున్నారని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ తీవ్ర స్థాయిలో ఆరోపించింది. అయితే ఇటీవల జనాల ఆస్తుల చెలగాటమాడుతున్న కాంగ్రెస్ సర్కారు.. 22ఏ జాబితా పేరిట అక్రమాలకు తెరలేపిందని, ఒక్క ఉప్పల్ సబ్ రిజిస్టార్ పరిధిలోనే వేల దరఖాస్తుల లావాదేవీలు జరిగినట్లుగా పేర్కొంది. ఈ సందర్భంగా ఆర్టీఐ కింద అడిగిన దరఖాస్తులను కూడా తిరస్కరిస్తున్నారని, ఎందుకు 22ఏ లావాదేవీల అంశాన్ని దాచిపెడుతున్నారని ప్రశ్నించింది. సర్కారు చర్యలతో, రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల జేబులు నిండుతున్నాయని, ఇప్పటికే దళారులు 22ఏ ఫైళ్ల పేరిట ప్రజల ఆస్తులను దోచుకుంటున్నారని, కాంగ్రెస్ నేతలు గద్దలా వెంటపడి వేధింపులకు గురిచేస్తున్నారని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ఆరోపించింది.