వాషింగ్టన్, సెప్టెంబర్ 19: హెచ్1బీ వీసా ప్రోగ్రామ్‌పై పర్యవేక్షణను కఠినతరం చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అమెరికన్ ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని తాజాగా లేదా భవిష్యత్తులో తొలగించనున్న ఉద్యోగులకు సంబంధించి యజమాన్యాల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలని అమెరికా విదేశాంగ, కార్మిక హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖలను ప్రభుత్వం ఆదేశించింది. అదే సమయంలో కొన్ని హెచ్-1బీ వీసా పిటిషన్లకు 1 లక్ష డాలర్ల రుసుము నిబంధనను ట్రంప్ ప్రభుత్వం ఏడాదిపాటు పొడిగించింది.
వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్ ప్రకారం హెచ్-1బీ ప్రోగ్రామ్ సమగ్రతను బలోపేతం చేయడానికి, ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడంతో పాటు ప్రోగ్రామ్ వ్యవస్థలో జరుగుతున్న దుర్వినియోగాలను పరిష్కరించడానికి అధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. హెచ్-1బీ వీసా దరఖాస్తులను సమీక్షించేటప్పుడు ఇటీవల లేదా భవిష్యత్తులో తొలగించనున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని అమెరికా విదేశాంగ మంత్రి, కార్మిక శాఖ మంత్రి, హోంల్యాండ్ సెక్యూరిటీ మంత్రిని ఈ ఉత్తర్వు ఆదేశించింది. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌ను నిర్వహించడానికి వేతనాలు, పారిశ్రామిక పరిస్థితులు, ఉపాధి ప్రత్యేకత వంటి అంశాలపై డాటాతో సహా అదనపు సమాచారాన్ని సేకరించేందుకు వాణిజ్య, విద్యా శాఖ మంత్రులు, వ్యాపార పరిపాలన నిర్వాహకుడితో సంప్రదించాలని ఆ మూడు విభాగాలను ఆదేశించినట్టు ఫ్యాక్ట్ షీట్ తెలిపింది.
అమెరికన్ ఉద్యోగుల భద్రతే లక్ష్యం
ఇదిలా ఉండగా 2025 సెప్టెంబర్ 19న తొలిసారి విధించిన నిర్దిష్ట హెచ్-1బీ వీసా దరఖాస్తుల కోసం 1 లక్ష డాలర్ల రుసుము నిబంధనను ప్రభుత్వం ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా పునరుద్ధరించింది. అమెరికన్ ఉద్యోగుల ఉపాధికి భంగం కలిగించే, జాతీయ భద్రతను దెబ్బతీసే విధానాలను ఆరికట్టడమే ఈ చర్య ఉద్దేశమని వైట్ హౌస్ పేర్కొన్నది. అత్యంత భారీ ఐటీ అవుట్సోర్సింగ్ సంస్థల ద్వారా జరిగే హెచ్-1బీ రిజిస్ట్రేషన్లను గతంలో జారీ చేసిన ఉత్తర్వు గణనీయంగా తగ్గించిందని ప్రభుత్వం పేర్కొన్నది. 2025 నాటి ఉత్తర్వు అమల్లోకి వచ్చినప్పటి నుంచి అతిపెద్ద ఐటీ అవుట్సోర్సింగ్ సంస్థలు దాఖలు చేసే హెచ్-1బీ రిజిస్ట్రేషన్లు 92 శాతం తగ్గాయి అని వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్ పేర్కొన్నది.
యజమానులు తక్కువ వేతనం పొందే విదేశీ ఉద్యోగులను వినియోగించడం వల్ల నైపుణ్యం కలిగిన అమెరికన్ ఉద్యోగుల వేతనాలపై ఒత్తిడి పడవచ్చని కూడా ఫ్యాక్ట్ షీట్ పేర్కొన్నది. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌ను దుర్వినియోగం చేయడం వల్ల నైపుణ్యం కలిగిన అమెరికన్ ఉద్యోగుల వేతనాలు తగ్గుతాయి. ఎందుకంటే చౌకైన విదేశీ ఉద్యోగుల లభ్యత దేశీయ వేతనాలపై ఒత్తిడిని పెంచుతుంది అని వైట్ హౌస్ తెలిపింది. హెచ్-1బీ ఉద్యోగులను నియమించుకునే ముందే కొందరు యజమానులు అత్యంత అర్హత కలిగిన అమెరికన్ ఉద్యోగులను తొలగించారు అని కూడా వైట్ హౌస్పేర్కొన్నది. కొంతమంది హెచ్-1బీ స్పాన్సరర్లు అనుసరించే అవుట్సోర్సింగ్ విధానాన్ని కూడా యంత్రాంగం ప్రస్తావించింది. హెచ్-1బీ ఉద్యోగులు నిర్వహించే కొన్ని ఉద్యోగాలు చివరికి అమెరికా వెలుపలికి తరలిపోతాయని వైట్ హౌస్ వాదించింది.