లోకేశ్వరం : కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టనున్న పోరుబాట ( BRS Poruobata )ను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ ముధోల్ నియోజకవర్గ సమన్వయ సమితి సభ్యులు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్ ( Lolam Shyam Sundar) పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు అమలుకాని 6 గ్యారెంటీలు, 420 హామీలను 100 రోజులలోనే అమలుచేస్తామని ప్రజలను నమ్మించి రేవంత్ గద్దెనెక్కి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి1000 రోజులు గడిచినప్పటికీ నేటివరకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి పూర్తి చేయలేదని ఆరోపించారు.
ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ) , వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) ఆదేశాల మేరకు ఈనెల 2న పోరుబాట నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్టు వివరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కరిపే శ్యాంసుందర్, పీఏసీఎస్ చైర్మన్ చిన్నారావు, మాజీ ఎంపీపీ సాగర్, మాజీ ఎంపీటీసీ సాయన్న, మాజీ సర్పంచ్ దిగంబర్, సోషల్ మీడియా మండల అధ్యక్షులు ప్రశాంత్, సందీప్ ప్రదీప్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.