Pakistan : ఇరాన్ యుద్ధం ప్రభావం పాకిస్తాన్‌పై దారుణంగా పడుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా చమురు సరఫరా ఆగిపోవడంతో పాకిస్తాన్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చమురు వాడకంపై ఆంక్షలు విధించింది ప్రభుత్వం. పాకిస్తాన్‌కు అత్యధికంగా చమురు సరఫరా అందేది హోర్ముజ్ జలసంధి నుంచే. కానీ, ఆ మార్గంలో చమురు రవాణాపై ఇరాన్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
తనకు అనుకూలమైన దేశాలకు చెందిన చమురు నౌకల్ని మాత్రమే అనుమతిస్తామని ఇరాన్ ప్రకటించింది. దీంతో పాకిస్తాన్‌కు ఇప్పట్లో ఈ మార్గంలో చమురు అందే అవకాశం లేదు. దీంతో దేశంలో చమురు వాడకంపై తీవ్రమైన ఆంక్షలు విధిస్తోంది. ఉన్న కొద్దిపాటు ఆయిల్‌నే వాడుకునేలా, వీలైనంతగా సేవింగ్ చేసుకునేలా ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సౌకర్యం కల్పించింది. అంటే ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లేందుకు వాహనాలు వినియోగించాల్సిన అవసరం ఉండదు. టెలికాం, ఐటీ కంపెనీలు ఈ విధానాన్ని వారంలో ఎక్కువ రోజులు పాటించాలని సూచించింది. ఆఫీసుల్లో కరెంట్ కూడా మిగులుతుంది. ఆఫీసులకు వెళ్లే వాళ్లు వాహనాలు వాడితే ఇతరులతో రైడ్ షేర్ చేసుకోవాలని కూడా ఆదేశించింది.
అలాగే విద్యా సంస్థలకు కూడా ఆన్లైన్ క్లాసులు మాత్రమే నిర్వహించుకోవాలని ఆదేశించింది. ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద పెట్రోల్, డీజిల్ నిల్వలు 25 రోజులకు సరిపడా ఉన్నాయి. 10 రోజులకు సరిపడా క్రూడాయిల్ ఉంది. అలాగే 15 రోజులకు సరిపడా ఎల్పీజీ ఉంది. ఈ లోపు హోర్ముజ్ జలసంధి నుంచి తగినంత చమురు సరఫరా కాకుంటే పాక్ మరింత తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది.