Peddi Sudarshan Reddy : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) అంత్యక్రియలు ముగిశాయి. పార్టీ శ్రేణులు, అభిమానులు, నల్లబెల్లివాసులు జనహృదయ నేతకు కన్నీటి వీడ్కోలు పలకగా.. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మంత్రి సీతక్క, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, ఎర్లబెల్లి, పల్లా, జగదీశ్ రెడ్డి తదితరులు పెద్దికి నివాళులర్పించారు.
జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యేగా.. ప్రజాసేవలో లీనమైన పెద్ది సుదర్శన్ రెడ్డికి అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. వరంగల్ నుంచి నర్సంపేట, అటు నుంచి స్వగ్రామమైన నల్లబెల్లి వరకూ అశేషంగా తరలివచ్చిన నాయకులు, అభిమానులతో సాగింది పెద్ది అంతిమయాత్ర. నల్లబెల్లిలో పెద్ది పార్థీవ దేహాన్ని గంట సేపు ఉంచి.. తర్వాత వ్యవసాయ క్షేత్రంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. ప్రజల కోసం తపించే అలాంటి నాయకుడు 51 ఏళ్లకే కన్నుమూయడం నర్సంపేటకే కాదు బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు.
పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన కేటీఆర్, హరీష్ రావు https://t.co/P8hS77jrwT pic.twitter.com/8goGj2AY14
— Telugu Scribe (@TeluguScribe) July 31, 2026
హన్మకొండలోని నివాసంలో జూలై 26 ఉదయం పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబసభ్యులు ఆయనను స్థానికంగా ఉన్న రోహిణి ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనకు వైద్యురాలు మమత 9సార్లు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. అనంతరం సర్జరీ, తదుపరి మెరుగైన చికిత్స కోసం పెద్దిని అంబులెన్స్‌లో సికింద్రాబాద్ యశోదకు తరలించారు. యశోదలోని పలు విభాగాల వైద్యులు పెద్దిని సమగ్రంగా పరీక్షించి.. బతికించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. కానీ, ఆరోగ్యం విషమించడంతో గురువారం అర్ధ రాత్రి దాటాక 12:51 గంటలకు పెద్ది కన్నుమూశారు.

ఈ విషాదకరమైన వార్త తెలియగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులు కన్నీటి పర్యంతమయ్యారు. ఉదయం నర్సంపేటకు అక్కడ నుంచి నల్లబెల్లికి పార్థీవ దేహాన్ని తరలించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తమ అభిమాన నాయకుడి కడసారి చూపుకోసం వర్షాన్ని సైతం లెక్కచేయకుండా.. ఆయన అంతిమయాత్రలో పాల్గొని కన్నీళ్లతో వీడ్కోలు పలికారు.
తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి కేసీఆర్ వెన్నంటే ఉన్నారు. వరంగల్ జిల్లా నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ సాధనకు అండగా నిలిచిన ఆదర్శ నాయకుడైన సుదర్శన్ రెడ్డి, 1974 ఆగస్టు 6న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి గ్రామంలో జన్మించారు. ఆయన 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం బీఆర్ఎస్) తరఫున జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (జెడ్పీటీసీ) సభ్యుడిగా ఎన్నికయ్యారు.
2004లో టీఆర్ఎస్ జిల్లా పార్టీ కన్వీనర్‌గా ఎన్నికై, ఆ తర్వాత 2002లో రాష్ట్ర పార్టీ కన్వీనర్‌గా నామినేట్ అయ్యారు. ఆయన ఎనిమిదేళ్లకు పైగా టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి, ఆ తర్వాత పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా నామినేట్ అయ్యారు.