Mahesh bigala | హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధుల పట్ల అనుసరిస్తున్న అప్రజాస్వామిక వైఖరిని బీఆర్ఎస్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలు, ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులతో అడ్డుకోవడం, అదుపులోకి తీసుకోవడం, కేసులు నమోదు చేయడం, అసెంబ్లీలో ప్రజల తరఫున మాట్లాడే అవకాశాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.
కేటీఆర్, హరీష్ రావు సహా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ఇటీవల జరిగిన పోలీసు చర్యలు, మహిళా ఎమ్మెల్యేల పట్ల వ్యవహరించిన తీరుపై వచ్చిన ఆరోపణలు, ఎమ్మెల్సీల అరెస్టులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ వంటి పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి నాయకత్వం వహించిన ఉద్యమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, దాదాపు పదేళ్లపాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించిన కేసీఆర్ నివాసం వద్దకు కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన పేరుతో వెళ్లి ఉద్రిక్త పరిస్థితులకు కారణమవడం అత్యంత గర్హనీయం అని పేర్కొన్నారు.
రాజకీయ విభేదాలు సహజమే అయినప్పటికీ, ఒక మాజీ ముఖ్యమంత్రి నివాసం వరకు రాజకీయ నిరసనలను తీసుకెళ్లడం తెలంగాణ రాజకీయ సంస్కృతికి మంచిది కాదన్నారు. ‘తెలంగాణ సాధన కోసం జీవితాన్ని ఉద్యమానికి అంకితం చేసిన నాయకుడి పట్ల ఇదేనా కాంగ్రెస్ చూపించే గౌరవం..?’ అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతిపక్ష బాధ్యతని, ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం కేసులు, అరెస్టులు, పోలీసు చర్యలు, సస్పెన్షన్ల ద్వారా ప్రతిపక్ష గొంతును అణచివేయాలని చూడటం సరికాదని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు ధోరణిని విడనాడి, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ నివాసం వద్ద జరిగిన ఘటనతోపాటు ఇటీవలి పరిణామాలపై ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ‘అధికారాలు శాశ్వతం కావు. ప్రభుత్వాలు మారవచ్చు. కానీ ప్రజాస్వామ్య విలువలు, తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ కోసం పోరాడిన నాయకుల గౌరవాన్ని కాపాడుకోవాలి. కేసులు, అరెస్టులు, బెదిరింపులతో ప్రజల తరఫున ప్రశ్నించే గొంతును అణచివేయలేరు.’ అన్నారు.
Asian Games | జపాన్‌లో భారీ వరదలు.. ఆసియా గేమ్స్‌కు ముప్పు.. అథ్లెట్స్ తరలింపు
AP News | రాబోయే ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామం లాంటివి : వైఎస్ జగన్
భూముల రీ-సర్వే పనులను వేగవంతం చేయాలి : జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి