వర్షాలు తక్కువగా పడుతయని నిపుణులు హెచ్చరించినా కాంగ్రెస్ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ప్రాజెక్టులు నడుప లేదు, కాలువలకు నీళ్లివ్వకుండా కాలయాపన చేసింది. పంటలు పండితే కొనాల్సి వస్తుందని, మద్దతు ధర, బోనస్, యూరి యా, కరెంటు ఇవ్వాల్సి వస్తుం దనే ఉద్దేశంతోనే ప్రభుత్వం సాగునీళ్లు ఇయ్యలేదు.
– కేటీఆర్

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 27 : సాగునీరున్నా పంటలకు ఇవ్వకుండా అవి ఎండిపోతుంటే సీఎం రేవంత్‌రెడ్డి తమాషా చూస్తున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాదాపు 40 శాతానికి పైగా పంటనష్టం జరిగిందని వాపోయారు. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని దేశీటిక్యాలలో రైతులను కలిసి పత్తి, మక్క పంటలను పరిశీలించి వారి సమస్యలు తెలుసుకున్నారు. పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. పత్తి రంగుమారిందని, కనీసం క్వింటాకు రూ.4 వేల ధర పలికే పరిస్థితి లేకుండా పోయిందని వాపోయారు.
ఆదివారం కొల్లాపూర్‌లో ఓ కార్యక్రమానికి హాజరై హైదరాబాద్ తిరిగి వెళ్లుండగా దేశీటిక్యాల వద్ద రైతులు కేటీఆర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. పత్తి పంటలు భారీ గా దెబ్బతిన్నాయని, మక్క పంటకూ తీవ్ర నష్టం కలిగిందని రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. వారి విజ్ఞప్తి మేరకు పంటలను పరిశీలించిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ రెండెకరాల్లో మక్క సాగు చేసేందుకు 2 లక్షల అప్పు చేసి పెట్టుబడి పెట్టానని రైతు శేఖర్‌రెడ్డి చెప్పాడని, పెట్టుబడి అంతా పోయిందని కన్నీటిపర్యంతమయ్యాడని పేర్కొన్నారు. రైతులు శేఖర్‌రెడ్డి, లక్ష్మయ్య, యాదమ్మ తదితరులు తమకు జరిగిన నష్టం గురించి వివరించారని, ఉమ్మడి పాలమూరు రైతులంతా ఇదే దుస్థితి ఎదుర్కొంటున్నారని తెలిపారు. నీళ్లు లేకపోవడమే కారణమని రైతులంటున్నరని చెప్పారు. గోదావరి, కృష్ణాలో నీళ్లు పుష్కలంగా ఉన్నా.. 248 టీఎంసీల నీటి లభ్యత ఉన్నా సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.

Ktr
ఎల్ నినోపై హెచ్చరించినా ఒడిసిపట్టలే
వాతావరణ నిపుణులు ఎల్ నినో ప్రభావంతో వర్షాలు సకాలంలో పడకపోవచ్చని ముందుగానే హెచ్చరించినా అందుబాటులో ఉన్న నీటిని ఒడిసిపట్టి చెరువులు నింపడం, కాలువలకు మళ్లించేందుకు ఎత్తిపోతలు చేపట్టాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను పూర్తి సామర్థ్యంతో నడుపడం లేదని విమర్శించారు. నీళ్లిస్తే పంటలు పండుతాయని, రైతుల నుంచి కొనాల్సి వస్తుందని, మద్దతు ధర, బోనస్, యూరియా, విద్యుత్తు తదితర అంశాలపై ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సి వస్తుందనే సాగునీరివ్వడం లేదని దుయ్యబట్టారు.
మోటర్లు నడిచే పరిస్థితి లేదు
రైతులు విద్యుత్తు సమస్యలను కూడా తన దృష్టికి తెచ్చారని, సాయంత్రం 7 దాటితే సింగిల్ ఫేజ్ కరెంటే వస్తున్నదని, మోటర్లు నడిచే పరిస్థితి ఉండటం లేదని బాలపీరు అనే రైతు చెప్పారని కేటీఆర్ వివరించారు. ఓవైపు రైతుబంధు ఇవ్వడం లేదని, మరోవైపు కరెంట్, నీళ్లు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో జూరాల, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల ద్వారా ఉమ్మడి పాలమూరులో సుమారు 8.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని గుర్తుచేశారు. చెక్‌డ్యామ్‌లు నిర్మించి, చెరువులు నింపడంతో భూగర్భజలాలూ పెరిగాయని, ప్రస్తుతం పాలమూరు ప్రాంతం ఎండిపోతున్నదని, అయినా కృష్ణానీటిని ఏపీకే తరలిస్తున్నారని చెప్పారు.
సర్వే చేసి పరిహారం అందించాలి
జిల్లాలో ప్రతి ఎకరానూ సర్వే చేసి ఎక్కడెక్కడ పంటనష్టం జరిగిందో గుర్తించాలని, రైతులకు తగిన పరిహారం అందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. వ్యవసాయాధికారులతోపాటు వ్యవసాయ మంత్రిని కలిసి రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. పంట నష్టం జరిగిన ప్రతి ఎకరానికీ తగిన పరిహారం అందే వరకు రైతుల తరఫున పోరాడుతామని, రైతులు అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్, శ్రీనివాస్‌యాదవ్, వెంకటేశ్, మాజీ జడ్పీటీసీ శ్రీశైలం, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్ ఉన్నారు.

