‘హస్త’వ్యస్త పాలన!
గ్యారెంటీల పేరుతో అలివికాని హామీలు ఇచ్చి పలు రాషా్ర్టల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అంతర్గత కుమ్ములాటలతో పాలనను గాలికొదిలేసింది.
- అంతర్గత కుమ్ములాటలతో కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో పరిపాలన గాలికి
- గ్యారెంటీలు గల్లంతు.. పడకేసిన సంక్షేమం.. కుంటుపడ్డ అభివృద్ధి
- తెలంగాణలో నిధుల కేటాయింపులో వివక్ష.. సీఎంపై స్వపక్షం నుంచే విమర్శలు
- కేరళలో సీఎం ఏకపక్ష నిర్ణయాలపై పార్టీ నాయకుల అసంతృప్తి
- కర్ణాటకలో డీకే, సిద్ధరామయ్య వర్గాల మధ్య ఆధిపత్య పోరు
- హిమాచల్‌లోనూ అదే తీరు.. మంత్రి పదవులు, కొత్త జిల్లాలపై ముదిరిన వర్గ విభేదాలు
న్యూఢిల్లీ/హైదరాబాద్, నవంబర్ 22 : గ్యారెంటీల పేరుతో అలివికాని హామీలు ఇచ్చి పలు రాషా్ర్టల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అంతర్గత కుమ్ములాటలతో పాలనను గాలికొదిలేసింది. ముఖ్యమంత్రుల ఒంటెద్దు పోకడలు, పదవుల కోసం నేతల వెంపర్లాట, నాయకుల మధ్య ఆధిపత్య పోరుతో సతమతమవుతున్న హస్తం పార్టీ.. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రజల నుంచి ఛీత్కారాలను ఎదుర్కొంటున్నది. పాలకులు పదవులను కాపాడుకునేందుకే సమయమంతా వెచ్చిస్తుండటంతో ఆయా రాషా్ర్టల్లో పాలన హస్తవ్యస్తంగా తయారైంది. ప్రజలు ఒక పార్టీకి అధికారం అప్పగించేది తమ సమస్యలను పరిష్కరించాలని, పాలనలో స్థిరత్వం ఉండాలని ఆశిస్తారు.
కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రాష్ర్టాలను పరిశీలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకుల మధ్య విభేదాలు బహిరంగ చర్చనీయాంశంగా మారితే, పాలన కంటే పార్టీ అంతర్గత రాజకీయాలే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక, కేరళ, హిమాచల్ ప్రదేశ్‌ల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు నిధుల కేటాయింపు, అవినీతి అంశాలపై ఆరోపణలు చేస్తుండగా, కేరళలో సీఎం సతీశన్ ఏకపక్ష నిర్ణయాలు, కీలక పదవుల నియామకాలపై పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక కర్ణాటకలో ఇటీవలే రెండు వర్గాల మధ్య తీవ్ర విభేదాలు ఏర్పడి ఏకంగా ముఖ్యమంత్రి పదవే చేతులు మారింది. హిమాచల్‌లోనూ మంత్రి పదవులు, కొత్త జిల్లాల ఏర్పాటుపై నేతలు కొట్లాడుకుంటున్నారు.
తెలంగాణలో నిధుల కేటాయింపుపై రగడ
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే విమర్శలు ఎదురవుతున్నాయి. ముఖ్యమంత్రికి, మంత్రులకు సన్నిహితంగా ఉన్న నేతల నియోజకవర్గాలకే అభివృద్ధి నిధులు ఎక్కువగా కేటాయిస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఈ అంశంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో కనీస అభివృద్ధి పనులకు కూడా నిధులు అందడం లేదని ఆరోపించారు.
ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కొడంగల్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర, మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గమైన హుజూర్‌నగర్‌లకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన విమర్శించారు. వెనుకబడిన మునుగోడుకు కనీసం రూ.500 కోట్లయినా కేటాయించాలని డిమాండ్ చేశారు. నిధులు నిలిపివేస్తే మరో రాజకీయ కురుక్షేత్రం తప్పదని హెచ్చరించారు. ఈ విమర్శలపై రేవంత్‌రెడ్డి నవంబర్ 19న సిద్దిపేటలో జరిగిన బహిరంగ సభలో పరోక్షంగా స్పందించారు. కొందరు నేతలు ప్రభుత్వంలో జరిగిన మంచి పనులను తన వద్ద రహస్యంగా చెబుతూ, లోపాలను మాత్రం బహిరంగ వేదికలపై విమర్శిస్తున్నారని అన్నారు. అలాంటి వారికి పిచ్చికుక్క కరిచినట్లుందని వ్యాఖ్యానించారు.
పదవుల నియామకాలపైనా విభేదాలు
పార్టీ, ప్రభుత్వంలో కీలక పదవుల నియామకాల విషయంలోనూ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. ఈ నెలలో ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి ర్యాలీ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే టీ లక్ష్మీకాంతారావు మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. మరోవైపు, మంత్రి శ్రీధర్‌బాబు, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ మధ్య కూడా విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కన్‌సింగ్ రాజ్ ఠాకూర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్న ప్రతిపాదనను వంశీకృష్ణ ప్రశ్నించినట్లు సమాచారం. కేరళలోనూ నియామకాలపై
అసమ్మతి
కాంగ్రెస్ అధికారం చేపట్టిన కేరళలోనూ పార్టీ అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే సీఎం సతీశన్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, గురువాయూర్ దేవస్వం బోర్డు వంటి కీలక సంస్థల్లో కాంగ్రెస్ నామినీల నియామకాలు వివాదానికి కారణమయ్యాయి. పార్టీ సహచరులతో సంప్రదింపులు జరపకుండానే ఈ నియామకాలు చేపట్టారని కొందరు మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.
సతీశన్, కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ వర్గాల మధ్య ఉన్న విభేదాలు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోస్తున్నాయని సమాచారం. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, విద్యుత్ శాఖ మంత్రి సన్నీ జోసెఫ్ కూడా బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతల మధ్య విభేదాల కారణంగా ప్రభుత్వరంగ సంస్థలు, సంక్షేమ బోర్డుల్లో వందలాది రాజకీయ నియామకాలు ఆలస్యమవుతున్నాయని వార్తలొస్తున్నాయి.
కర్ణాటకలో అధికారం కోసం ఘర్షణ
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య అధికారం కోసం తీవ్ర ఘర్షణ నెలకొంది. సిద్ధరామయ్య పాలన రెండున్నరేండ్లు పూర్తవగానే ఇది మరింత పెరిగింది. చివరకు అధిష్ఠానం జోక్యం చేసుకుని సిద్ధరామయ్యను దించేసి డీకేకు అధికారం అప్పగించింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య సాగిన నాయకత్వ పోరు చివరకు ముఖ్యమంత్రి మార్పుతో ముగిసింది. అయితే నాయకత్వ మార్పు జరిగినంత మాత్రాన అంతర్గత విభేదాలు పూర్తిగా సమసిపోయాయని చెప్పలేం. ఇప్పటికీ రెండు వర్గాలు ఒకరిపై ఒకరు కుట్రలు పన్నుకుంటున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం డీకే పాలనలో మంత్రిపదవుల కోసం ఎమ్మెల్యేల మధ్య పోటీ, మహిళలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్ వంటి అంశాలు పార్టీకి సవాలుగా మారాయి.
హిమాచల్ ప్రదేశ్‌లో తరాల అంతరం
తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న కాంగ్రెస్ పాలిత హిమాచల్‌ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు నాయకత్వానికి, మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ కుటుంబానికి చెందిన నాయకుల మధ్య రాజకీయ భేదాభిప్రాయాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా వీరభద్రసింగ్‌కు ఉన్న రాజకీయ ప్రాధాన్యత, ఆయన కుటుంబానికి పార్టీలో దక్కాల్సిన గుర్తింపు, ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకునే విధానం వంటి అంశాలు చర్చకు వస్తున్నాయి. ఈ నెలలో వీరభద్రసింగ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరుకాకపోవడం మరోసారి ఈ విభేదాలపై చర్చకు దారితీసింది. మంత్రి పదవులపైనా, కొత్త జిల్లాల ఏర్పాటుపైనా పార్టీ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు నెలకొన్నాయి.
జడ్చర్ల ఎమ్మెల్యే కమీషన్ల ఆరోపణలు
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి కూడా రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేశారు. అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించాలంటే కాంట్రాక్టర్ల నుంచి అధికారులు 10 నుంచి 20 శాతం వరకు కమీషన్లు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. తన నియోజకవర్గంలో సుమారు రూ.40 కోట్ల పనుల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని చెబుతూ, నిరవధిక నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. ఈ ఆరోపణలపై బీజేపీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

