ఊరుకోవద్దు.. ఉపేక్షించొద్దు!.. అసంతృప్త ఎమ్మెల్యేల తిరుగుబాటు!
సర్కార్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. ఇక ఊరుకోవద్దని, ప్రభుత్వ తీరును ఉపేక్షించవద్దన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.
- అసలు కాంగ్రెస్‌పైనే వ్యతిరేక ముద్రా?
- నిధులడిగితే బెదిరించాలని చూస్తరా?
- మూడేండ్లలో ఇవ్వనివి ఇప్పుడిస్తరా?
- ఇన్నాళ్లు ఊరుకున్నం..ఇక ఓపిక లేదు
- ఎన్నికల్లో ఓటమి తప్పించుకోవాలంటే ప్రజల తరఫున మాట్లాడాల్సిందే..!
- టెలికాన్ఫరెన్స్‌లో అసమ్మతి ఎమ్మెల్యేలు
- అసంతృప్తులను బుజ్జగించేందుకు రంగంలోకి దిగిన యువ ఎంపీ
హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : సర్కార్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. ఇక ఊరుకోవద్దని, ప్రభుత్వ తీరును ఉపేక్షించవద్దన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ప్రభుత్వం ఏర్పడి మూడేండ్లయినా ప్రజలకు చెప్పుకోవడానికి ఒక్క పని కూడా చేయలేదని, ఇచ్చిన హామీలకు అతీగతిలేదని, ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో తాము కూడా ఓడిపోవడం ఖాయమని, ఓటమిని తప్పించుకోవాలంటే ప్రజల పక్షాన మాట్లాడాల్సిందే అని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇటీవల కొంతమంది కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేలు టెలికాన్ఫరెన్స్ పెట్టుకున్నట్టు తెలిసింది. సిద్దిపేటలో సీఎం సభ అనంతరం ఈ ఫోన్ చర్చలు సుదీర్ఘంగా జరిగినట్టు తెలుస్తున్నది. మూడేండ్లలో నియోజకవర్గానికి రూ.3కోట్లు కూడా ఇవ్వలేనివాళ్లు ఇప్పుడు ఇంకో ఏడాదిలో ఏమిస్తారని, ఇక ఓపిక నశించిందని ఓ యువ ఎమ్మెల్యే తెగేసి చెప్పిట్టు తెలిసింది. నిధులన్నీ సీఎం నియోజకవర్గానికి పోతున్నాయని, ఏమైనా మిగిలితే పొంగులేటి, భట్టి తీసుకెళ్తుంటే ఇక కొత్తగా ఎన్నికైన తమకు అసలే ఇవ్వడం లేదని మరో ఎమ్మెల్యే వాపోయారని సమాచారం. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి రావడం ఏమోకానీ తాము కూడా ఎమ్మెల్యేలుగా గెలిచే పరిస్థితి ఉండదన్న అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది.
రంగంలోకి ముఖ్యనేత అనుచరుడు
ఎమ్మెల్యేల అసంతృప్తి, మీడియా ముఖంగా వ్యాఖ్యలు చేయడం, టెలికాన్ఫరెన్స్ పెట్టుకున్నారనే సమాచారం తెలిసి ముఖ్యనేత వీరిని బుజ్జగించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందుకోసం తనకు అనుకూలమైన ఇద్దరుముగ్గురు ఎమ్మెల్యేలను ఎంచుకొని వారితో మాట్లాడే బాధ్యతను దక్షిణ తెలంగాణకు చెందిన ఓ యువ ఎంపీకి అప్పగించాడు. ఆ ఎంపీ ఇటీవల వారిని వ్యక్తిగతంగా కలిశారని తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడవద్దని, ప్రభుత్వం పనిచేయడం లేదని సొంత పార్టీ ఎమ్మెల్యేలే అంటే ఇబ్బందులు అవుతాయని ఆ ఎంపీ చెప్పినట్టు సమాచారం. ఏదైనా సమస్య ఉంటే తాను సీఎంతో మాట్లాడుతానని, సహకరించాలని కోరినట్టు తెలిసింది. ప్రభుత్వ పనితీరు ఆశించిననట్టు లేదని, పనితీరు మార్చుకోవాలని తాము సూచన చేస్తే పట్టించుకోకుండా వ్యతిరేక ముద్ర వేసి నిధులు ఆపేస్తామంటూ బెదిరిస్తున్నారని ఆ ఎంపీతో అసమ్మతి ఎమ్మెల్యేలు చెప్పారు. తాము కూడా మాట్లాడకపోతే ప్రజలకు న్యాయం జరుగదని, అంతా బాగుందనుకొని సంబురపడాలా అని ప్రశ్నించినట్టు తెలిసింది. నియోజకవర్గాలకు వెళ్తే అక్కడి ప్రజలు చెప్తున్న విషయాలను ప్రభుత్వానికి నివేదిస్తున్నామని, ఇదేదో పార్టీ వ్యతిరేక ధోరణిగా చిత్రీకరించడం విడ్డూరంగా ఉన్నదని చెప్పినట్టు తెలిసింది.
భారీ నజరానాలు ఆఫర్!
మీ పనులు, బిల్లులు ఏమైనా ఉంటే సానుకూలంగా పరిష్కరించేలా చూస్తామని ఆ యువ ఎంపీ వారికి హామీ ఇచ్చినట్టు తెల్సింది. మంత్రి పదవులు భర్తీ చేసినపుడు మీ పేరు పరిశీలిస్తామని, ఇప్పుడున్న పథకాల్లో ప్రత్యేక కోటా ఇచ్చి ఇండ్లు, రేషన్‌కార్డులు వంటివాటిని ఇస్తామని, దీంతోపాటు ఏమైనా కాంట్రాక్టు పనులు తెచ్చుకుంటామంటే ఇస్తామని, పెండింగ్ బిల్లులను మంజూరు చేయడంలో ప్రాధాన్యత ఇస్తామంటూ ఆ యువ ఎంపీ రాయబారం నడిపినట్టు తెలిసింది.
నేడు ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌తో పలువురి భేటీ!
రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ సందీప్‌తో అసంతృప్త ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. పార్టీ హైకమాండ్ సూచనలతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కలువనున్నారు. పైకి మర్యాదపూర్వకంగా కలుస్తున్నప్పటికీ ఈ భేటీ సందర్భంగా రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై తమ అభిప్రాయాలను విస్పష్టంగా చెప్పనున్నారు. ఒకరిద్దరు లిఖిత పూర్వకంగా కూడా తమ అభిప్రాయాలను చెప్పాలని యోచిస్తున్నట్టు తెలిసింది.
తేల్చుకొనే యోచనలో ఎమ్మెల్యేలు!
ప్రభుత్వం మూడేండ్లయినా నిధులు ఇవ్వకుండా సతాయిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం, సీఎంతో తేల్చుకుందామన్న ఆలోచనతోనే పలువురు ఎమ్మెల్యేలు ఉన్నట్టు సమాచారం. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి వచ్చేలా కనిపించడం లేదని, తాము కూడా ప్రభుత్వ నిర్వాకాలు, సీఎం, ఆయన కోటరీ హద్దుమీరిన తీరుపై గట్టిగా నిలబడకపోతే పార్టీ ఆగమైపోతుందన్న ఆలోచనతో వారు ఉన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో సీఎం, ఆయన వర్గంతో తేల్చుకుందామన్న ఆలోచనతో ఉన్నట్టు పలువురు ఎమ్మెల్యేలు ‘నమస్తే తెలంగాణ’తో చెప్పారు. ఇక కేవలం ఏడాది మాత్రమే ఉన్నదని, మూడేండ్లలో చేయలేని పనులన్నీ ఒక్క ఏడాదిలో ఎలా చేయగలమని, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని, ఆ ప్రభావం తమపై పడొద్దంటే ఇప్పుడు ప్రజల పక్షాన కొట్లాడాల్సి ఉంటుందని చెప్పినట్టు తెలిసింది.
అసలు కాంగ్రెస్‌పైనే వ్యతిరేక ముద్రా?
అసలైన కాంగ్రెస్వాదులపై పార్టీ వ్యతిరేకులన్న ముద్ర వేసేందుకు పార్టీలోని ఒక వర్గం పనిగట్టుకొని ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నదని వారు ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. నిధులు ఇవ్వకపోవడం, అవినీతి పెరిగిపోవడంపై తాము ప్రభుత్వానికి సూచనలు చేస్తే దాన్ని నెగిటివ్‌గా ప్రచారం చేసి తమనే పార్టీ నుంచి బయటకు పంపాలనే కుట్ర జరుగుతున్నదని వాపోయారట. మూడేండ్లయినా హామీలు అమలుకాకపోవడం, నిధులు రాకపోవడం, ప్రతీ పనికి పర్సంటేజీలు సమర్పించుకోవాల్సి రావడం వంటి దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని, ఇదే విషయాన్ని తాము ప్రస్తావిస్తున్నామని ఓ సీనియర్ ఎమ్మెల్యే టెలికాన్ఫరెన్స్‌లో చెప్పినట్టు తెలిసింది. త్వరలో అందరం కలిసి భేటీ అవుతామని, అధిష్ఠానానికి ఇక్కడి విషయాలన్నీ వివరించి చెప్పాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

