HC Balakrishna | ‘గ్యారెంటీలు’ లేకుంటే బాగుండు.. కర్ణాటక కాంగ్రెస్ మంత్రి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు!
HC Balakrishna | ‘ఐదు గ్యారెంటీలు లేకపోయి ఉంటే బాగుండు’ అంటూ తాజాగా మంత్రి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. గృహలక్ష్మి స్కీమ్‌ని ఎత్తేయాలని మరో పార్టీ నేత సలహా ఇచ్చారు.
HC Balakrishnaబెంగళూరు, సెప్టెంబర్ 27: గ్యారెంటీలంటూ హామీలిచ్చి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఆ గ్యారెంటీలను అమలుచేయలేం బాబోయ్ అంటూ లబోదిబోమంటున్నది. గద్దెనెక్కి మూడేండ్లు కావొస్తున్నా ఇప్పటికీ గ్యారెంటీలను పూర్తిగా అమలుచేయని హస్తం పార్టీ.. అరకొరగా అమలు చేస్తున్న వాటినీ అటకెక్కించేందుకు సిద్ధమవుతున్నది. ఆ పార్టీకి చెందిన మంత్రులు, నేతలు ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ‘ఐదు గ్యారెంటీలు లేకపోయి ఉంటే బాగుండు’ అంటూ తాజాగా మంత్రి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. గృహలక్ష్మి స్కీమ్‌ని ఎత్తేయాలని మరో పార్టీ నేత సలహా ఇచ్చారు. అలవికాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు వాటిని అమలుచేయలేక చేతులెత్తేయడంపై కన్నడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బాబ్బాబు.. అర్థం చేసుకోండి..
తమపై ఐదు ప్రధాన గ్యారెంటీ పథకాల భారం కనుక లేకపోయి ఉంటే ఆర్థిక వ్యవహారాల నిర్వహణ చాలా సులభంగా ఉండేదని కర్ణాటక మంత్రి హెచ్‌సీ బాలకృష్ణ పేర్కొన్నారు. మున్సిపల్ వ్యవహారాల మంత్రిగా ఉన్న బాలకృష్ణ.. డిమాండ్ల సాధనకు రామనగరలో ఆందోళన చేస్తున్న దివ్యాంగులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో సంక్షేమ పథకాలకు సంబంధించిన హామీలు, జీతభత్యాలు, అభివృద్ధి పనుల వ్యయం మధ్య సమతుల్యతను పాటించాల్సి ఉందని పేర్కొన్నారు. ‘మేమే కనుక ఈ ఐదు గ్యారెంటీలు ఇవ్వకపోయి ఉంటే, బహుశా ఆర్థికంగా మాకు ఇన్ని పెద్ద సమస్యలు వచ్చి ఉండకపోవచ్చు. ఇవన్నీ మేం చాలా సులభంగా చేసే వాళ్లం. కానీ ప్రభుత్వాన్ని నడపాలి. ప్రతీపనిని వ్యవస్థలో భాగంగా, బడ్జెట్ పరిధిలో చేయాలి’ అని ఆందోళన చేస్తున్న దివ్యాంగులను ఉద్దేశించి పేర్కొన్నారు. ఆందోళనకారులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తాను అర్థం చేసుకోగలనని, పథకాల భారంతో కునారిల్లుతున్న ప్రభుత్వ ఆర్థిక పరిమితుల గురించి కూడా వారు ఆలోచించాలని మంత్రి పేర్కొన్నారు.
సమస్యల్లో చిక్కుకున్నాం..
‘ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూడండి. ప్రతీదీ మేం నిర్వహించుకోవాలి. ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వాలి. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. మాకు కూడా పలు పరిమితులు ఉన్నాయి’ అని మంత్రి బాలకృష్ణ అన్నారు. ‘మేం ప్రజల సంక్షేమం కోసమే ఈ గ్యారెంటీ ఇచ్చాం. ఒక వేళ రాష్ట్రంలో కరువు ఏర్పడితే రైతులకు సహాయం అందించాలి. లేకపోతే వారు కూడా ఆందోళనలు చేయవచ్చు’ అని తెలిపారు. అలాగే ఇప్పటివరకు గ్యారెంటీ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారు కూడా నిరసనలు తెలియజేయవచ్చునని పేర్కొన్నారు. మేమంతా ఈ సమస్యల మధ్య చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్నామని ఆయన తెలిపారు.
అదే సమయంలో ప్రస్తుతం అమలు చేస్తున్న ఐదు గ్యారెంటీలను నిలిపివేసే ఉద్దేశం ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు ఎంతమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ పరిస్థితిని గురించి అర్థం చేసుకోవాలని, ఆర్థిక ఇబ్బందుల గురించి ఇస్తున్న వివరణను తమకు కష్టాలు కలిగించే ప్రయత్నంగా భావించ వద్దని ఆయన నిరసనకారులకు విజ్ఞప్తి చేశారు. కాగా, ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్సీ తిప్పనప్ప కమక్నూర్ కౌన్సిల్లో మాట్లాడుతూ ప్రభుత్వానికి భారంగా మారిన గృహలక్ష్మి గ్యారెంటీ పథకాన్ని ఎత్తివేయాలని కోరారు. తాజాగా మంత్రి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మరింత దిగజారుతున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చెప్పకనే చెబుతున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | మంచినీళ్లు తక్కువ తాగితేనే కాదు.. మరీ ఎక్కువ తాగినా ఆరోగ్యానికి హానికరమే..!
Nepal PM Balen Shah | భారత్ చేరుకున్న నేపాల్ ప్రధాని.. సోమవారం ప్రధాని మోదీతో చర్చలు
Festivals | పండుగల సమయంలో స్వీట్లను ఎక్కువగా తింటే షుగర్ లెవల్స్ ఎప్పటికీ అలాగే ఉంటాయా..?
JEE Main | ఈ రాత్రి 12 గంటలకు ముగియనున్న గడువు.. ఇప్పటికే 13 లక్షలు దాటిన జేఈఈ దరఖాస్తులు..!
Health tips | మీలో ఈ లక్షణాలుంటే ఆలస్యం చేయకుండా థైరాయిడ్ పరీక్షలు చేయించుకోండి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

