కాంగ్రెస్ ప్రభుత్వం 2024లో బతుకమ్మ చీరల పథకాన్ని నిలిపివేసి నేతన్నలకు ఉపాధి లేకుండా చేసింది. నేతన్నల పోరాటం తర్వాత చీరల పథకాన్ని మరో పేరుతో ప్రారంభించినా కేవలం మహిళా సంఘాలకే పరిమితం చేసింది. గతంలో సిరిసిల్ల నేతన్నలకు ఇచ్చిన సూల్ యూనిఫామ్‌లు, కేసీఆర్ కిట్, రంజాన్, క్రిస్మస్ గిఫ్ట్‌ప్యాక్‌లు, సంక్షేమ శాఖ వస్త్ర ఆర్డర్లను పెద్ద పరిశ్రమకు కేటాయించింది. నేతన్నలకు ఏడాదంతా ఉండాల్సిన పని ఆర్నెల్ల కంటే తకువకు పడిపోయింది.
-కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : గత బీఆర్ఎస్ ప్రభుత్వం సిరిసిల్ల నేత కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో బతుకమ్మ చీరల పథకాన్ని ప్రారంభించి విజయవంతంగా అమలు చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బతుకమ్మ చీరల పథకాన్ని నిలిపివేసి 2024లో నేతన్నలకు పూర్తిగా ఉపాధి లేకుండా చేసిందని విమర్శించారు. నేతన్నలకు పాత బకాయిలన్నీ చెల్లించామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నా, రూ.300 కోట్ల బకాయిల్లో ఇంకా రూ.60 కోట్లు చెల్లించాల్సి ఉన్నదని చెప్పారు. నేతన్నలకు ఇవ్వాల్సిన 10 శాతం యార్న్ సబ్సిడీని రేవంత్ సర్కార్ నిలిపివేసిందని మం డిపడ్డారు. ‘రూ.60 కోట్ల పెండింగ్ బకాయిలు ఎప్పు డు చెల్లిస్తరు? 10 శాతం యార్న్ సబ్సిడీని ఎప్పుడు విడుదల చేస్తరో? స్పష్టమైన తేదీలు ప్రకటించాలి’ అని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి హోదాలో సిరిసిల్లకు వస్తున్నందున రాజకీయ విమర్శలు, వ్యక్తిగత దూషణలకు పోకుండా ప్రజల సమస్యలకు సమాధానం చెప్పాలని కోరారు. ఈ మేరకు శనివారం సీఎంకు కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. సిరిసిల్ల అభివృద్ధిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1,272 ఎకరాల భూమి మాత్రమే పంపిణీ జరిగిందని, అందులో సిరిసిల్ల నియోజకవర్గంలో 204 ఎకరాలు మాత్రమే పంపిణీ చేశామని తెలిపారు. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా రైతుల అభ్యర్థనల మేరకు, అర్హత ప్రకారం రికార్డులు సవరించామని చెప్పారు. 8 వేల ఎకరాల భూమి ఎకడున్నది? అందులో 2,400 ఎకరాలు ఏ భూమి? ఏ మం డలం? ఏ గ్రామం? ఏ సర్వే నంబర్? ఎవరి పేరుపై ఉన్నది? ఎంత విస్తీర్ణం? అనే వివరాలను ప్రభుత్వం ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు.
వస్త్ర పరిశ్రమ ఉన్న సిరిసిల్లను కాదని వేములవాడలో యార్న్ డిపో ఏర్పాటు చేయడం ద్వారా సిరిసిల్ల నేతన్నలను అవమానించారని కేటీఆర్ విమర్శించారు. వస్త్రోత్పత్తికి రూ.300 కోట్ల విలువైన యార్న్ అవసరం ఉంటే రూ.50 కోట్లే కేటాయించారని తెలిపారు.
సిరిసిల్లలోనే యార్న్ డిపో ఏర్పాటు చేసి అవసరమైన మేరకు యార్న్ అందుబాటులోకి తేవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతుబీమా తరహాలో నేత కార్మికుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన రూ.5 లక్షల నేతన్న బీమా పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ ప్రీమియం కూడా చెల్లించకుండా నిలిపివేసిందని తెలిపారు.
నేతన్న బీమాను ఎప్పుడు పునరుద్ధరిస్తారో ముఖ్యమం త్రి ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెద్దూర్ ప్రాం తంలో 60 ఎకరాల్లో రూ.174 కోట్లతో అపరెల్ పార్ నిర్మించామని తెలిపారు. గోకుల్దాస్, టెక్స్ పోర్ట్ తదితర సంస్థల ద్వారా 2,500 మంది మహిళలకు ఉపాధి కల్పించామని చెప్పారు. మరో 8 వేల మందికి పని కల్పించే అవకాశం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి సహకరించడం లేదని వాపోయారు. అపరెల్ పార్లో ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు? ఎంతమందికి ఉపాధి కల్పిస్తారో? వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కార్మికులను యజమానులుగా మార్చే లక్ష్యంతో 88 ఎకరాల్లో రూ.387.61 కోట్లతో వీవింగ్ పార్ ఏర్పాటు చేశామని కేటీఆర్ తెలిపారు. 50 షెడ్లు నిర్మించి, మొదటి దశలో 1,104 మంది కార్మికులకు ఒకొకరికి నాలుగు చొప్పున మొత్తం 4,416 అధునాతన మరమగ్గాలు అందించామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ షెడ్లను వడ్ల గోదాములు, విద్యుత్తు పరికరాల గోదాములు, ఇతర అవసరాలకు వినియోగిస్తూ నేతన్నల కలలను దెబ్బతీస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. వీవింగ్ పార్ను ఎప్పుడు ప్రారంభిస్తారు? షెడ్లను ఎప్పటిలోగా నేతన్నలకు కేటాయిస్తారు? కార్మికులను ఎప్పటిలోగా యజమానులుగా మారుస్తారో? సీఎం స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం మరమగ్గాల, చేనేత అభివృద్ధి కార్పొరేషన్లను వేర్వేరుగా ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. సిరిసిల్లకు చెందిన గూడూరి ప్రవీణ్‌ను చైర్మన్‌గా నియమించి నేతన్నల ఆత్మగౌరవాన్ని నిలబెట్టామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కార్పొరేషన్లను పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. కార్పొరేషన్లను పునరుద్ధరించి, సిరిసిల్ల పద్మశాలీ బిడ్డను చైర్మన్‌గా ఎప్పుడు నియమిస్తారో తేదీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల పద్మశాలీ సంక్షేమ సంఘ భవనానికి 5 ఎకరాల భూమి కేటాయించి రూ.5 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించామని తెలిపారు. ప్రస్తుతం బిల్లులు విడుదల చేయకుండా నిర్మాణాన్ని మధ్యలోనే నిలిపివేశారని విమర్శించారు. పెండింగ్ నిధులు విడుదల చేసి భవన నిర్మాణాన్ని ఎప్పటిలోగా పూర్తి చేస్తారో ప్రకటించాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ హయాంలో సిరిసిల్ల నియోజకవర్గంలోని సుమారు 56 వేల మంది రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున రూ.532 కోట్ల పెట్టుబడి సాయం రైతుబంధు కింద అందించామని కేటీఆర్ గుర్తుచేశారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో రైతుబంధును రూ.15 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. ఎగ్గొట్టిన రైతుబంధు బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో, ఎకరాకు రూ.15 వేల చొప్పున ఎప్పటి నుంచి ఇస్తారో ప్రకటించాలని డిమాండ్ చేశా రు. కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేల రైతుబంధు ఇస్తామని ఇచ్చిన హామీని ఎప్పటి నుంచి అమలు చేస్తారో ముఖ్యమంత్రి ప్రకటించాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన రూ.2 లక్షల రైతు రుణమాఫీ హామీని సంపూర్ణంగా ఎప్పటిలోగా అమలు చేస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో రైతుబీమా కింద సిరిసిల్ల నియోజకవర్గంలోని 806 రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.40.30 కోట్లు అందించామని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం బీమా సంస్థకు ప్రీమియం చెల్లించకుండా రైతుబీమా పథకాన్ని నిలిపివేసిందని, దాన్ని ఎప్పుడు పునరుద్ధరిస్తారో ప్రకటించాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.12 కోట్లతో సుమారు 260 మంది రైతులకు ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పనిముట్లు అందించిందని కేటీఆర్ గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం వ్యవసాయ యాంత్రికీకరణను పట్టించుకోవడం లేదని విమర్శించారు. నియోజకవర్గంలో రూ.15 కోట్లతో నాలుగు కొత్త మారెట్ కమిటీలు ఏర్పాటు చేశామని, సర్దాపూర్‌లో రూ.26 కోట్లతో ఆధునిక మారెట్ యార్డు నిర్మించామని తెలిపారు. 25 వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం కల్పించామని చెప్పారు. సిరిసిల్లకు అదనంగా ఎన్ని టన్నుల మారెట్ గోదాములను మంజూరు చేస్తారో సీఎం ప్రకటించాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల నియోజకవర్గంలో సాగునీటి సామర్థ్యాన్ని 1.36 లక్షల ఎకరాలకు పెంచామని తెలిపారు.
కాళేశ్వరం 9వ ప్యాకేజీలో భాగంగా మధ్య మానేరు నుంచి అప్పర్ మానేరు వరకు అనుసంధాన పనులను రూ.1,604 కోట్లతో చేపట్టామని, రూ.533 కోట్లతో 3 టీఎంసీల సామర్థ్యంతో మలపేట రిజర్వాయర్ పూర్తిచేశామని తెలిపారు. మలపేట నుంచి అప్పర్ మానేరు వరకు నీటిని ఎప్పుడు తరలిస్తారు? డిస్ట్రిబ్యూటరీ కాలువలను ఎప్పుడు మంజూరు చేస్తారో? స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మిషన్ కాకతీయలో భాగంగా రూ.80 కోట్లతో చెరువుల అభివృద్ధి, ట్యాంక్ బండ్ల నిర్మాణం చేపట్టామని కేటీఆర్ తెలిపారు. రూ.140 కోట్లతో 12 చెక్ డ్యామ్‌లు నిర్మించామని చెప్పారు. జిల్లాలో చెరువుల అభివృద్ధికి, చెక్ డ్యామ్‌ల నిర్మాణానికి ఎన్ని కోట్లు కేటాయిస్తారో సీఎం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
యువతకు ఉపాధి కల్పించే పరిశ్రమలను సిరిసిల్లకు తీసుకురావడంతోపాటు ఆక్వా హబ్, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌ను అభివృద్ధి చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో 366 ఎకరాల్లో రూ.90 కోట్లతో ఆక్వా హబ్‌కు శ్రీకారం చుట్టామని తెలిపారు. నర్మాల గ్రామంలో 309 ఎకరాల్లో రూ.100 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేశామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు మూడేండ్లవుతున్నా కొత్త పరిశ్రమల ఏర్పాటు సంగతి పకన పెడితే, ఇప్పటికే మంజూరైన పరిశ్రమలను పూర్తి చేసే చర్యలు కూడా చేపట్టలేదని విమర్శించారు. సిరిసిల్లలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ఎన్ని కోట్లు కేటాయిస్తారో ప్రకటించాలని డిమాండ్ చేశారు.
సిరిసిల్లను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ విద్యాసంస్థలను ఏర్పాటు చేసిందని కేటీఆర్ తెలిపారు. జిల్లాలో రూ.400 కోట్లతో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ, రూ.166 కోట్లతో మెడికల్ కాలేజీ, రూ.10 కోట్లతో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, రూ.80 కోట్లతో వ్యవసాయ కళాశాల, రూ.36 కోట్లతో నర్సింగ్ కళాశాల, రూ.4 కోట్లతో ప్రభుత్వ ఐటీఐ ఏర్పాటు చేశామని తెలిపారు. రూ.400 కోట్లతో మంజూరైన జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీకి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని విమర్శించారు. జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ నిర్మాణానికి అవసరమైన నిధులను సిరిసిల్ల పర్యటనలోనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. మన ఊరు-మన బడి కింద పూర్తయిన పనులకు బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తున్నదని మండిపడ్డారు. పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
2014 నుంచి 2023 వరకు సిరిసిల్ల పట్టణంలో సుమారు రూ.1,564 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని కేటీఆర్ వివరించారు. సిరిసిల్ల నియోజకవర్గానికి ఎన్ని రోడ్లు, ఎన్ని భవనాలు మం జూరు చేస్తారో? వెంటనే ఎన్ని నిధులు విడుదల చేస్తా రో ప్రకటించాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల సహకార విద్యుత్తు పంపిణీ సంస్థ (సెస్)ను నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు రద్దు చేశారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని, ‘ఏక్ పోలీస్’ హామీని అమలు చేయాలని, సిరిసిల్ల వైద్యరంగ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే చర్యలు, కేటాయించే నిధుల వివరాలను సీఎం ప్రకటించాలని డిమాండ్ చేశారు. నేతన్నలు, గౌడన్నలు, ముదిరాజ్‌లు, యాదవులు, ఇతర వర్గాల సంక్షేమానికి పర్యటన సందర్భంగా ఎన్ని నిధులు మంజూ రు చేస్తారో సీఎం ప్రకటించాలని కోరారు. ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీసీ ఏలోకి చేరుస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయాలని గుర్తుచేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, విద్యార్థినులకు సూటీలు,ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం ఎప్పుడు ఇస్తారో ప్రకటించాలని డిమాండ్ చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం సిరిసిల్ల నేత కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో బతుకమ్మ చీరల పథకాన్ని ప్రారంభించి విజయవంతంగా అమలు చేసిందని కేటీఆర్ గుర్తుచేశారు. సూల్ యూనిఫామ్‌లు, కేసీఆర్ కిట్, రంజాన్, క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్‌లు, సంక్షేమశాఖ వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లతోపాటు అనేక ప్రభుత్వ ఆర్డర్లను సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమకు అందించామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో రూ.3,313 కోట్ల విలువైన 100 కోట్ల మీటర్ల బట్టకు పీపీ ఆర్డర్లు, టెసో ద్వారా ఆర్డర్లు ఇచ్చామని వివరించారు. దీంతో నేతన్నలకు ఏడాది పొడవునా ఉపాధి లభించడంతోపాటు నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం పొందే పరిస్థితి కల్పించామని తెలిపారు.
సిరిసిల్ల వస్త్ర ఉత్పత్తుల టర్నోవర్‌ను ఏడాదికి రూ.250 కోట్ల నుంచి దాదాపు రూ.1,000 కోట్లకు పెంచామని, నేతన్నల ఆత్మహత్యలు తగ్గడంతోపాటు వలసలు కూడా నిలిచిపోయాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల పథకాన్ని నిలిపివేసి 2024లో నేతన్నలకు పూర్తిగా ఉపాధి లేకుండా చేసిందని విమర్శించారు. నేతన్నల పోరాటం తర్వాత చీరల పథకాన్ని మరో పేరుతో ప్రారంభించినా దాన్ని కేవలం మహిళా సంఘాలకే పరిమితం చేశారని తెలిపారు. గతంలో నేతన్నలకు ఏడాదంతా ఉన్న పని ఆరు నెలల కంటే తకువకు పడిపోయిందని మండిపడ్డారు.