శంషాబాద్ రూరల్, సెప్టెంబర్ 27: అధికార బలంతో కొన్ని వానపాములు కూడా నాగుపాముల్లా బుసలు కొడుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నీ గమనిస్తున్నామని, టైం వచ్చినప్పుడు అందరి లెక్కలు తేలుస్తామని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పటోళ్ల కార్తీక్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన చేరికల కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పని అయిపోయిందన్నారు. కారు గుర్తు మీద గెలిచి రేవంత్‌రెడ్డి పంచన చేరారని, ఎందుకు చేరారో తెలుసన్నారు. ఘన్సిమియాగూడలోని భూముల కోసమా? సుల్తాన్పూర్ కోసమా? దేనికి పోయారో మాకు తెలుసన్నారు. ఎవరినీ విడిచిపెట్టబోమని, అందరి లెక్కలూ తేలుస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడెక్కడైతే లుచ్చా పనులు చేస్తున్నారో.. ఎవరెవరైతే రెచ్చిపోతున్నారో.. ఎక్కడ అమ్ముడుపోయి వ్యవహారం చేస్తున్నారో.. అన్నీ తెలుసన్నారు. ఎవ్వరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. అన్నింటికీ టైం వస్తదని, అప్పుడు ఏం చేయాలో చేసి చూపిస్తామన్నారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివి
కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా శంషాబాద్‌లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి కేటీఆర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తొలిదశ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆయన మలిదశ ఉద్యమంలో సైతం ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. ఆయన సేవలు తెలంగాణ సమాజం ఎప్పుడూ మరిచిపోదని గుర్తు చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, జగదీష్ర్డెడి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి కార్తీక్‌రెడ్డి పాల్గొన్నారు.
కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు: సబితా ఇంద్రారెడ్డి
విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మూడేండ్ల కిందట జరిగిన ఎన్నికల్లో అనేక తప్పడు హామీలు ఇవ్వడంతో కాంగ్రెస్‌కు ప్రజలు ఓట్లు వేస్తే.. హామీలను అమలు చేయకుండా అభివృద్ధిని పూర్తిగా నిలిపివేశారని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాజేంద్రనగర్ నియోకవర్గంలో మణికొండ, కోకాపేట, నార్సింగి, అప్ప జంక్షన్ మీదగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రైలు నిర్మాణం కోసం నిధులు కేటాయించి భూమిపూజ చేస్తే.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ తప్పిదం వల్ల ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయి అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందన్నారు. హిమాయత్‌సాగర్ చెరువు సమీపంలో కొండలు, గుట్టల్లో కేటీఆర్ ఆధ్వర్యంలో ఎకో పార్క్ నిర్మాణం చేపట్టడం వల్ల పర్యాటకులు పెద్దఎత్తున వస్తుండడంతో నిత్యం రద్దీగా మారందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నేటి వరకు నియోజవకర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పారు.

కాంగ్రెస్ తీరుతో నిలిచిన అభివృద్ధి: కార్తిక్ రెడ్డి
అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి కార్తీక్‌రెడ్డి విమర్శించారు. ఈనియోజవకవర్గ ప్రజలు కేసీఆర్‌ను చూసి కారుగుర్తుపై ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తన స్వలాభం కోసం అధికార పార్టీలోకి వెళ్లారన్నారు. అధికార కాంగ్రెస్‌లో చేరినా ఒక్క అభివృద్ధి పని చేపట్టలేదని చెప్పారు. నేడు కాంగ్రెస్‌పై పూర్తిస్థాయిలో వ్యతిరేకత వచ్చిందని, నియోజకవర్గంలో ప్రజలంతా కాంగ్రెస్‌ను గెలిపించి తప్పు చేశామని అంటున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను గెలిపించి కేసీఆర్‌కు బహుమతిగా ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్లో చేరిన వారిలో జిల్లా కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడు బి.సాయిరెడ్డి, మాజీ ఎంపీటీసీ, మారెట్ కమిటీ డైరెక్టర్ బి.రాజు, మణికొండ మాజీ సర్పంచ్ యాలాల నరేశ్, జైహింద్ రావు, పుప్పాలగూడ మాజీ ఎంపీటీసీ పాపాలాల్ సింగ్, మణికొండ కౌన్సిలర్ యాలాల లావణ్య తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కొన్నమొల్ల శ్రీనివాస్, కొలన్ ప్రదీప్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మోహన్‌రావు, మాజీ ఎంపీపీ చెక్కల ఎల్లయ్య, మాజీ జడ్పీటీసీ బుర్కుంట సతీష్, రాష్ట్ర నాయకుడు మంచర్ల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ చెక్కల చంద్రశేఖర్, నాయకులు రాజేందర్, గౌస్‌పాషా, బుచ్చిరెడ్డి, హన్మంతు, గుంటిచరణ్, పరందాములు, కుమ్మరి అర్జున్, నాగేష్‌నాయక్, సురేష్‌ముదిరాజ్, మురళిగౌడ్, గుంటిబాలు పాల్గొన్నారు.